Nirav Modi: నీరవ్ మోదీకి లండన్ కోర్టులో షాక్.. భారత్‌కు అప్పగింత కేసు పిటిషన్ కొట్టివేత
ఈ వార్తాకథనం ఏంటి
పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి లండన్‌లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తనను భారత్‌కు అప్పగించే ప్రక్రియను నిలిపివేసి, కేసు విచారణను మళ్లీ ప్రారంభించాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను లండన్‌లోని హైకోర్ట్ ఆఫ్ జస్టిస్, కింగ్స్ బెంచ్ డివిజన్ తిరస్కరించింది. దీంతో నీరవ్ మోదీని భారత్‌కు రప్పించే దిశగా భారత దర్యాప్తు సంస్థలకు మరో కీలక విజయం దక్కినట్టైంది. రక్షణ రంగ మధ్యవర్తి సంజయ్ భండారీ కేసులో యూకే హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రస్తావిస్తూ నీరవ్ మోదీ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఆ కేసులో భారత్‌కు అప్పగిస్తే హింసకు గురయ్యే అవకాశం ఉందని భండారీ వాదించగా, మానవతా కారణాలతో కోర్టు ఆయన అప్పగింతను నిరాకరించింది.
వివరాలు
సీబీఐ వాదనలు.. కోర్టు స్పష్టత
అదే విధంగా తనకు కూడా భారత్‌లో హింస ప్రమాదం ఉందని పేర్కొంటూ, తన కేసును తిరిగి విచారించాలని నీరవ్ మోదీ కోరారు. ఈ కేసు విచారణ సమయంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అధికారులు లండన్‌కు వెళ్లి, అక్కడి క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్ న్యాయవాదులతో కలిసి నీరవ్ మోదీ వాదనలను ఖండించారు. కేసును మళ్లీ తెరవాల్సినంత అసాధారణ పరిస్థితులు లేవని కోర్టు అభిప్రాయపడింది. పిటిషన్‌లో చెప్పిన కారణాలు సరిపోవని, ఇప్పటికే ఇచ్చిన తీర్పును సమీక్షించాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తూ కోర్టు పిటిషన్‌ను కొట్టివేసింది.
వివరాలు
పీఎన్‌బీ కుంభకోణం
పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) కుంభకోణంలో నీరవ్ మోదీ ప్రధాన నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. బ్యాంకు పేరుతో నకిలీ గ్యారెంటీలు ఉపయోగించి విదేశాల్లో రుణాలు పొందినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. సీబీఐ దర్యాప్తు ప్రారంభానికి కొద్దిరోజుల ముందే 2018 జనవరిలో ఆయన దేశం విడిచి పారిపోయారు. అనంతరం 2019లో యూకేలో అరెస్ట్ అయిన నీరవ్ మోదీ, అప్పటి నుంచి అప్పగింతపై న్యాయపోరాటం కొనసాగిస్తున్నారు.