DCP Shantanu Sinha: దేశం విడిచి పారిపోతాడన్న అనుమానం.. కోల్కతా డీసీపీ పై లుక్ అవుట్ నోటీసు
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమ బెంగాల్‌లో అధికార మార్పుల తర్వాత అవినీతి కేసులపై కట్టుదిట్టమైన చర్యలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో కోల్కతా డీసీపీ శాంతను సిన్హా బిస్వాస్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) లుక్ అవుట్ నోటీసు జారీ చేసింది. 'సోనా పప్పు' కేసుకు సంబంధించిన మనీ లాండరింగ్ ఆరోపణల నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. శాంతను దేశం విడిచి పారిపోవచ్చన్న అనుమానంతో ఈ నోటీసు జారీ చేసినట్లు సమాచారం. ఇప్పటికే 'సోనా పప్పు సిండికేట్' కేసులో భాగంగా ఈడీ పలుమార్లు శాంతనును విచారణకు పిలిచింది. సోనా పప్పు అలియాస్ బిస్వజీత్ పొద్దార్ నడిపినట్లు అనుమానిస్తున్న నేర ముఠాతో సంబంధాలపై మనీ లాండరింగ్ దర్యాప్తు కొనసాగుతోంది.
వివరాలు
ఇసుక అక్రమ రవాణా కేసులో ఈడీ ఫోకస్
ఈకేసులో ఇప్పటికే వ్యాపారవేత్త జోయ్ కామ్దార్‌ను అరెస్ట్ చేశారు. ఈకేసుతో లభించిన సమాచారం ఆధారంగా ఈ నెలలో శాంతను బిస్వాస్ ఇంటిపై ఈడీ దాడులు కూడా నిర్వహించింది. దాడుల తర్వాత ఆయన ప్రజల్లో కనిపించకపోవడం గమనార్హం. సోనా పప్పు సిండికేట్ కేసులో భూ ఆక్రమణలు,వసూళ్లు,ఆయుధాల కేసులు వంటి పలు ఆరోపణలు నమోదయ్యాయి. ఈనేపథ్యంలో ఈడీ దర్యాప్తును మరింత విస్తరించింది.దర్యాప్తులో భాగంగా శాంతను బిస్వాస్‌తో పాటు ఆయన ఇద్దరు కుమారులను కూడా విచారణకు పిలిచినా,వారు హాజరుకాలేదు. ఇక ఇసుక అక్రమ రవాణా కేసులో కూడా శాంతనుపై ఈడీ ఫోకస్ పెట్టింది. మనీలాండరింగ్ ఆరోపణలపై విచారణకు హాజరుకావాలని నోటీసులు ఇచ్చినా,ఆయన స్వయంగా రాకుండా న్యాయవాదిని పంపించారు. ఈకేసులో కూడా ఆయనను ప్రశ్నించేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు.