Loading...
Kiren Rijiju-Rahul Gandhi: రాహుల్‌ గాంధీ మనసు మారినట్లుందే.. కిరణ్‌ రిజిజు చురకలు
రాహుల్‌ గాంధీ మనసు మారినట్లుందే.. కిరణ్‌ రిజిజు చురకలు

Kiren Rijiju-Rahul Gandhi: రాహుల్‌ గాంధీ మనసు మారినట్లుందే.. కిరణ్‌ రిజిజు చురకలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 08, 2026
11:53 am

ఈ వార్తాకథనం ఏంటి

మహిళా శక్తిని ఉద్దేశించి కాంగ్రెస్‌ అగ్రనేత, ఎంపీ రాహుల్‌ గాంధీ చేసిన వీడియో సందేశంపై కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు స్పందించారు. కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఎట్టకేలకు ఓ సానుకూల సందేశం వచ్చినట్లుందని చురకలంటించారు. మహిళల విషయంలో రాహుల్‌ గాంధీ మనసు మారినట్లు కనిపిస్తోందంటూ 'ఎక్స్‌' వేదికగా వ్యాఖ్యానించారు.

వివరాలు

'మహిళలు తమను తాము వ్యక్తపరచుకునే స్వేచ్ఛ కోల్పోయారు'

రాహుల్‌ గాంధీ ఇటీవల నిర్వహించిన 'ఆస్క్‌ మి ఎనీథింగ్‌' సెషన్‌లో నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు.

ఈ సందర్భంగా మహిళా శక్తిపై ఆయన ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. భారత మహిళల శక్తి బందీగా ఉండిపోయిందని రాహుల్‌ వ్యాఖ్యానించారు.

రాజకీయాలు, వ్యాపార రంగాల్లోనే కాకుండా సొంత ఇళ్లలో కూడా మహిళలకు తమ భావాలను స్వేచ్ఛగా వ్యక్తపరచుకునే అవకాశం లభించడం లేదని అన్నారు.

కనీసం తమను తాము ఊహించుకునే స్వేచ్ఛ కూడా లేకుండా పోయిందని పేర్కొన్నారు. వీధుల్లో కూడా మహిళలు సౌకర్యవంతంగా, స్వేచ్ఛగా తిరగలేకపోతున్నారని రాహుల్‌ అన్నారు.

వివరాలు

దేశాభివృద్ధిలో మహిళల భాగస్వామ్యం కీలకం

మహిళలు తమను తాము పూర్తిస్థాయిలో వ్యక్తపరచుకోలేని ఏ దేశమూ విజయవంతం కాలేదని తాను భావిస్తున్నట్లు చెప్పారు.

దేశాభివృద్ధిలో మహిళల భాగస్వామ్యం కీలకమని పేర్కొన్న ఆయన.. మహిళల భాగస్వామ్యం లేకపోతే, వారి గళం వినిపించేందుకు అవకాశం లేకపోతే దేశం అసంపూర్ణంగా, కుంటుపడిన స్థితిలోనే ఉంటుందని వ్యాఖ్యానించారు.

ఈ విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేలా చేయడమే తన రాజకీయాల్లో కీలకమైన అంశాల్లో ఒకటని తెలిపారు. ఈ వీడియోను కాంగ్రెస్‌ పార్టీ తన 'ఎక్స్‌' ఖాతాలో షేర్‌ చేసింది.

ADVERTISEMENT

వివరాలు

'రిజర్వేషన్ల బిల్లుకు బేషరతుగా మద్దతివ్వాలి'

రాహుల్‌ గాంధీ వీడియోపై కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు స్పందించారు. కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఎట్టకేలకు సానుకూల సందేశం వచ్చినట్లుందని అన్నారు.

మహిళలపై రాహుల్‌ గాంధీ మనసు మారినట్లు కనిపిస్తోందని వ్యాఖ్యానించిన రిజిజు.. ఇకనైనా మహిళా రిజర్వేషన్ల బిల్లుకు కాంగ్రెస్‌ బేషరతుగా మద్దతు ఇస్తుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.

ADVERTISEMENT

వివరాలు

2029 ఎన్నికలకు ముందే 33% రిజర్వేషన్లకు ప్రయత్నాలు

మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించే ప్రక్రియను 2029 సార్వత్రిక ఎన్నికలకు ముందే పూర్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం మరోసారి పార్లమెంటు ఆమోదం పొందే ప్రయత్నాలు చేస్తోంది.

ఇందులో భాగంగా ప్రస్తుతం ఉన్న 543 లోక్‌సభ నియోజకవర్గాలను 816కి పెంచేలా పునర్విభజన చేయాలనే ప్రతిపాదనపై ప్రభుత్వం ముందుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

దీనికి సంబంధించిన బిల్లులపై చర్చించేందుకు పార్లమెంటులో ప్రత్యేక సమావేశం నిర్వహించే అవకాశంపై కూడా వార్తలు వెలువడుతున్నాయి.

అయితే మహిళా రిజర్వేషన్లకు సంబంధించిన ప్రతిపాదిత బిల్లులపై కాంగ్రెస్‌ సహా విపక్షాలు కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి.

ప్రస్తుత లోక్‌సభ నియోజకవర్గాల సంఖ్య, సరిహద్దుల ఆధారంగానే మహిళలకు రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

ADVERTISEMENT