
Cyclone Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాల హెచ్చరిక
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్రమైన అల్పపీడనం రాబోయే 12 గంటల్లో మరింత బలపడి వాయుగుండం రూపంలో మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచిస్తోంది. ఈ అల్పపీడనం అక్టోబర్ 3వ తేదీ నాటికి దక్షిణ ఒడిస్సా నుంచి ఉత్తర కోస్తా వరకు తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది. దీనివల్ల అక్టోబర్ 1న విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి జిల్లాలు, యానాం ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే అల్లూరి సీతారామ రాజు జిల్లా, పార్వతీపురం మన్యం జిల్లా, శ్రీకాకుళం, ఏలూరు, కృష్ణ, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు హెచ్చరించారు.
Details
రాబోయే మూడ్రోజులు వర్షాలు
రాబోయే మూడు రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వానలు పడే అవకాశం ఉంది. వాతావరణ శాఖ మత్స్యకారులకు నాలుగు రోజుల పాటు సముద్రంలో వేటకు వెళ్ళకూడదని సూచించింది. రాష్ట్రంలోని అన్ని పోర్టులకు అక్టోబర్ 3వ తేదీ నాటికి ప్రమాద హెచ్చరిక జారీ చేయబడింది. ఉత్తర కోస్తా ప్రాంతంలో 7 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించబడింది. నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో ఎక్కువ మంది భక్తులు గుమిగూడకుండా ఉండేందుకు అధికారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. భారీ వర్షాలు, వరద ధాటికి రైలు, రోడ్డు రవాణా మార్గాలు దెబ్బతినే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.