
Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాల హెచ్చరిక
ఈ వార్తాకథనం ఏంటి
బంగాళాఖాతంలో ప్రస్తుతం అల్పపీడనం కొనసాగుతోంది. ఇది మరింత బలపడుతూ వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ ప్రభావంతో వచ్చే 24 గంటల్లో కోస్తాంధ్ర ప్రాంతంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని విశాఖపట్టణం వాతావరణ కేంద్రం ప్రకటించింది. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. అవసరమైతే 0891-2590102, 0891-2590100 నంబర్లలో సంప్రదించాలని అధికారులు సూచించారు. మరోవైపు, వచ్చే మూడు గంటల్లో శ్రీకాకుళం,విజయనగరం,పార్వతీపురం మన్యం,విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి,కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు.
వివరాలు
నిండుకుండలా గంభీరం
గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది. ఇక విశాఖపట్నంలోని గంభీరం జలాశయం నిండుకుండలా పొంగిపొర్లుతోంది. అనకాపల్లి జిల్లా బీఎన్ రోడ్డులో విజయరామరాజుపేట వద్ద తాచేరు వంతెనపై వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. దాంతో వడ్డాది-చోడవరం మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. చోడవరం నుంచి పాడేరు, మాడుగుల వెళ్లే బస్సులను విజయరామరాజుపేట నుంచి కేజే పురం మీదుగా మళ్లిస్తున్నారు. ఇక నర్సీపట్నం నుంచి బయలుదేరే బస్సులు వడ్డాది వరకే వెళ్లగలుగుతున్నాయి.