AP Rains: ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి పొంచి ఉన్న ముప్పు
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తుపాను ముప్పు పొంచి ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో శుక్రవారం ఒక అల్పపీడనం ఏర్పడిందని పేర్కొంది. ఇది పశ్చిమ-వాయవ్య దిశగా నెమ్మదిగా కదులుతూ, శనివారం నాటికి వాయుగుండంగా, ఆదివారం నాటికి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది. అనంతరం సోమవారం నాటికి ఇది నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాత ప్రాంతాల్లో తుపానుగా బలపడవచ్చని అంచనా వేసింది. ఈ తుపానుకు 'మొంథా (మోన్‌థా)' అనే పేరు ఇవ్వనున్నట్లు ఐఎండీ వెల్లడించింది. ఈ పేరును థాయ్‌లాండ్ సూచించింది. దీని ప్రభావంతో రాబోయే ఐదు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో విస్తారమైన వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.
Details
అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్
శనివారం బాపట్ల, ప్రకాశం, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు పడవచ్చని హెచ్చరించింది. ఆదివారం నాటికి గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అలాగే కాకినాడ, డా.బీఆర్. అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, పల్నాడు, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో కూడా భారీ వర్షాలు పడవచ్చని పేర్కొంది.
Details
పాకాలలో అధిక వర్షపాతం
సోమవారం, మంగళవారాల్లో దక్షిణ కోస్తా ఆంధ్ర మరియు రాయలసీమ ప్రాంతాల్లో చోటుచోటు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. ఇక శుక్రవారం నాడు డా.బీఆర్. అంబేడ్కర్ కోనసీమ, ఏలూరు, అల్లూరి సీతారామరాజు, కృష్ణా, అనకాపల్లి, గుంటూరు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యాయి. గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు ప్రకాశం జిల్లా పాకాలలో అత్యధికంగా 152.25 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ వివరించింది.