'త్వరలోనే లక్నో పేరు 'లక్ష్మణ్ నగరి'గా మార్పు', యూపీ డిప్యూటీ సీఎం ప్రకటన
లక్నో పేరు మార్పుపై ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్ కీలక ప్రకటన చేశారు. భదోహిలో జిల్లాలో వివిధ పథకాలు, అభివృద్ధి పనుల పురోగతిపై డిప్యూటీ సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు. సూర్యావలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి విగ్రహాన్ని కూడా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా లక్నో పేరును మార్చాలన్న బీజేపీ ఎంపీ సంగమ్ లాల్ గుప్తా డిమాండ్‌పై ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లక్నో లక్ష్మణుడి నగరమని అందరికీ తెలుసునని, పేరు మార్పుపై తదుపరి చర్చలు ఉంటాయన్నారు. డిప్యూటీ సీఎం బ్రజేష్ పాఠక్ వ్యాఖ్యలను బట్టి చూస్తే, ప్రభుత్వం లక్నో పేరును మార్చాలనే ఉద్దేశంతో ఉన్నట్లు ఉన్నట్లు స్పష్టమవుతోంది.
రాహుల్ గాంధీ మానసిక సమతుల్యత పూర్తిగా దెబ్బతిన్నది: బ్రజేష్
లోక్‌సభలో ప్రాధాని మోదీపై రాహుల్ గాంధీ విమర్శలు చేసిన నేపథ్యంలో బ్రజేష్ పాఠక్ స్పందించారు. రాహుల్ గాంధీ మానసిక సమతుల్యత పూర్తిగా దెబ్బతిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎప్పుడొచ్చినా అవి పూర్తిగా అవినీతిలో కూరుకుపోయాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో బొగ్గు, కామన్వెల్త్, ఎన్నో పెద్ద కుంభకోణాలు చోటు చేసుకున్నట్లు చెప్పారు. భారతీయ జనతా పార్టీ ఎంపీ సంగమ్ లాల్ గుప్తా మంగళవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ఉత్తరప్రదేశ్ రాజధాని నగరం లక్నో పేరును మార్చాలని కోరారు. త్రేతా యుగంలో నగరానికి గతంలో లఖన్‌పూర్, లక్ష్మణ్‌పూర్ అని పేరు పెట్టారని, నవాబ్ అసఫ్-ఉద్-దౌలా లక్నోగా పేరు మార్చారని బీజేపీ ఎంపీ పేర్కొన్నారు.