మధ్యప్రదేశ్‌లో అమానుషం: దళితుడికి మలం పూసిన వైనం
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. ఛతార్ పూర్ జిల్లాలోని బికౌరా గ్రామంలో దళిత కార్మికుడి ముఖం, ఇతర శరీర భాగాలకు మలాన్ని పూసిన సంఘటన బయటకు వచ్చింది. శుక్రవారం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిందితుడు రామ్ క్రిపాల్ పటేల్ ఓబీసీ సామాజిక వర్గానికి చెందినవాడు. బాధితుడైన దశరథ్ అహిర్వార్ దళిత సామాజిక వర్గానికి చెందిన కార్మికుడు. నిందితుడు రామ్ క్రిపాల్ పటేల్, మురికి కాలువ పక్కనే ఉన్న బోరింగ్ పంపు వద్ద స్నానం చేస్తుండగా, మురికి కాలువ నిర్మాణ పనుల్లో భాగమైన దశరథ్.. అనుకోకుండా రామ్ క్రిపాల్ పటేల్ శరీరానికి గ్రీజ్ అంటించాడు.
సెక్షన్ 294, 506 కింద నిందితుడిపై కేసు నమోదు
గ్రీజ్ అంటిన మరుక్షణం, కోపం తెచ్చుకున్న రామ్ క్రిపాల్, అక్కడే ఉన్న మానవ మలాన్ని కప్‌లో తీసుకొచ్చి దశరథ్ ముఖం, శరీరభాగాలపై పూసాడు. ఈ విషయమై గ్రామపంచాయతీకి వెళ్ళాడు దశరథ్. కానీ గ్రామపంచాయతీ దశరథ్‌కి 500రూపాయల జరిమానా విధించింది. ఇక చేసేదేమీ లేక పోలీసులను అశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు నిందితుడిపై భారతీయ శిక్షాస్మృతి ప్రకారం సెక్షన్ 294, సెక్షన్ 506 షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల (అత్యాచారాల నిరోధక చట్టం) కింద కేసు నమోదు చేసారు. దశరథ్, అతని తోటి కార్మికులు సరదాగా గ్రీజును ఒకరిపై ఒకరు విసురుకుంటున్నారని, అలా నిండితుడు రామ్ క్రిపాల్ పటేల్ పై పడిందని పోలీసులు పేర్కొన్నారు.