Madhya Pradesh: అదృష్టం అంటే వీళ్లదే.. 15.34 క్యారెట్ రత్నమాణిక్యం దొరికింది..
ఈ వార్తాకథనం ఏంటి
ఆర్థికంగా వెనకబడిన, తమ సోదరీమణుల వివాహానికి నిధులు సమకూర్చడంలో కష్టపడుతున్న ఇద్దరు యువకులకు అదృష్ట లక్ష్మి తలుపుతట్టింది. ఇరవై రోజుల క్రితం వారు లీజుకు తీసుకున్న ఓ చిన్న గనిలో తవ్వకాలు చేస్తుండగా అతి విలువైన రూ.50 లక్షల వజ్రాన్ని కనుగొన్నారు. ఈ అదృష్టం మధ్యప్రదేశ్‌లోని పన్నా జిల్లాకు చెందిన సతీశ్ ఖాతిక్, సాజిద్ మొహమ్మద్‌లకు దక్కింది. పన్నా జిల్లా రాణిగంజ్‌కు చెందిన సతీశ్ (24) మాంసం దుకాణం నిర్వహిస్తుంటే,సాజిద్ (23) పండ్ల వ్యాపారం చేసేవాడు. ఇద్దరివీ ఆర్థికంగా వెనకబడిన కుటుంబాలు. తమ అదృష్టాన్ని పరీక్షించాలనుకున్న వీరి ప్రయత్నం సక్సెస్ అయింది.
వివరాలు
రూ.50 లక్షల విలువ
సాజిద్ తండ్రి, తాత కూడా గతంలో వజ్రాల కోసం తవ్వకాలు చేసినప్పటికీ ఎక్కువ ఫలితం రాలేదు. అయినప్పటికీ, సుమారు 20 రోజుల క్రితం వారు ఒక చిన్న గనిని లీజుకు తీసుకుని తవ్వకాలు ప్రారంభించారు. ఈ క్రమంలో తళుక్కున మెరిసే వజ్రం వీరి కంటపడింది.దీనిని వెంటనే స్థానిక డైమండ్ అధికారికి అందించారు. పరిశీలనలో,అది 15.34 క్యారెట్ నాణ్యమైన వజ్రంగా నిర్ధరించారు.దీనికి రూ.50 లక్షల విలువ అంచనా వేసారు. కొద్దిరోజుల్లో ఇది వేలం ద్వారా విక్రయించనున్నట్లు అధికారులు తెలియజేశారు. దీనిద్వారా వచ్చే నగదును సమానంగా తీసుకోవాలని ముందుగానే స్నేహితులిద్దరూ నిర్ణయించుకున్నారు. మొదట తమ సోదరీమణుల వివాహం కోసం ఖర్చు పెట్టి, మిగతా మొత్తం డబ్బుతో చిన్న వ్యాపారం మొదలుపెడతామని చెబుతున్నారు.