Air Taxi: మానవరహిత ఎలక్ట్రిక్ ఎయిర్‌ట్యాక్సీ ప్రయోగాలు విజయవంతం
ఈ వార్తాకథనం ఏంటి
గుంటూరులో అభివృద్ధి చేస్తున్న ఎలక్ట్రిక్ ఎయిర్‌ట్యాక్సీకి సంబంధించిన మానవరహిత విమాన ప్రయోగాలు విజయవంతంగా పూర్తయ్యాయని మ్యాగ్నమ్‌వింగ్స్ సంస్థ వ్యవస్థాపకుడు చావా అభిరామ్ తెలిపారు. గురువారం గుంటూరులో మీడియాతో మాట్లాడిన ఆయన, వి2 2.0 నమూనాపై పూర్తి స్థాయి ప్రయోగాలు విజయవంతంగా నిర్వహించినట్లు వెల్లడించారు. ఇప్పటికే వి2 వేదికకు సంబంధించిన నిర్మాణ పరీక్షలను పూర్తి చేసి ప్రదర్శించినట్టు చెప్పారు. పట్టణ ప్రాంతాల్లో వేగవంతమైన ప్రయాణ అవసరాలను దృష్టిలో పెట్టుకొని వి2 2.0 నమూనాను రూపొందించినట్లు ఆయన తెలిపారు. ఈ ఎలక్ట్రిక్ ఎయిర్ మొబిలిటీ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 45 నిమిషాల పాటు సుమారు 30 కిలోమీటర్లు ప్రయాణించగలదన్నారు.
వివరాలు
ఎయిర్ అంబులెన్స్‌గా కూడా వినియోగించే అవకాశం
ఇందులో మొత్తం ఎనిమిది మోటార్లు అమర్చినట్లు, వాటిలో రెండు అకస్మాత్తుగా పనిచేయకపోయినా భద్రంగా దిగే విధంగా సాంకేతిక వ్యవస్థను రూపొందించినట్లు వివరించారు. ఈ ఎయిర్ ట్యాక్సీలో రాడార్, లైడర్ వంటి ఆధునిక పరికరాలు కీలకంగా పనిచేస్తాయని చెప్పారు. ప్రయాణ సమయంలో సమీపంలో పక్షులు ఎగురుతున్నా రాడార్ గుర్తించి హెచ్చరికలు ఇస్తుందని తెలిపారు. అలాగే ల్యాండింగ్, టేకాఫ్ సమయంలో చెట్లు, విద్యుత్ తీగలు వంటి అడ్డంకులను లైడర్ గుర్తించి సురక్షితంగా దిగేందుకు సహకరిస్తుందని పేర్కొన్నారు. ఈ వాహనాన్ని ఎయిర్ అంబులెన్స్‌గా కూడా వినియోగించే అవకాశం ఉందని చావా అభిరామ్ చెప్పారు. 360 డిగ్రీల దృశ్య వ్యవస్థతో చుట్టుపక్కల ప్రాంతమంతా స్పష్టంగా కనిపించేలా ఏర్పాటు చేసినట్లు వివరించారు.
వివరాలు
భవిష్యత్తులో అత్యవసర రవాణా, వైద్య సేవలు
ప్రపంచవ్యాప్తంగా ఎయిర్ ట్యాక్సీ వేదికలను అభివృద్ధి చేసి ప్రయోగ దశకు తీసుకొచ్చిన సంస్థలు చాలా తక్కువగా ఉన్నాయని, ఆ జాబితాలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మ్యాగ్నమ్‌వింగ్స్ చోటు సంపాదించిందన్నారు. సర్టిఫికేషన్ ప్రక్రియలు, మానవ ప్రయాణ పరీక్షలు, భద్రతా అనుమతులు పూర్తయ్యాక మానవులతో ప్రయోగాత్మక ప్రయాణాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ ఏడాది చివరికల్లా ఎయిర్ ట్యాక్సీ సేవలను ప్రారంభించాలనే లక్ష్యంతో సంస్థ పనిచేస్తోందన్నారు. భవిష్యత్తులో అత్యవసర రవాణా, వైద్య సేవలు, పర్యాటకం, పరిశ్రమల అవసరాలు, ప్రాంతీయ అనుసంధానం వంటి రంగాల్లో ఈ సేవలను విస్తరించనున్నట్లు వెల్లడించారు.