Page Loader
Kumbh Mela: మహా కుంభమేళాలో తొక్కిసలాట ఘటన - భారత్‌లో గతంలోను చోటుచేసుకున్న ఘటనలు ఇవే!

Kumbh Mela: మహా కుంభమేళాలో తొక్కిసలాట ఘటన - భారత్‌లో గతంలోను చోటుచేసుకున్న ఘటనలు ఇవే!

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 29, 2025
02:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రఖ్యాత ఆధ్యాత్మిక మహోత్సవం మహా కుంభమేళా 2025 లో బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకున్న తొక్కిసలాట ఘోర విషాదాన్ని మిగిల్చింది. మౌని అమావాస్య సందర్భంగా పవిత్ర త్రివేణి సంగమం లో స్నానం చేయడానికి వేలాది భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ క్రమంలో సెక్టార్ 2 వద్ద ఏర్పడిన తొక్కిసలాటలో 20 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. అదేవిధంగా 100 మందికి పైగా గాయపడినట్లు సమాచారం. భారతదేశంలో ఇలాంటి ప్రమాదాలు గతంలో కూడా చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు,భారీ ఉత్సవాల సమయంలో అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరాన్ని ఈ సంఘటనలు మరోసారి గుర్తు చేస్తున్నాయి. అధికార యంత్రాంగం ఎన్ని పటిష్ట చర్యలు చేపట్టినా, భక్తుల్లోని అత్యుత్సాహం, అనవసర భయాలు, వదంతులు ఈ తరహా ఘటనలకు దారితీస్తున్నాయి.

వివరాలు 

గతంలో జరిగిన తొక్కిసలాట ఘటనలు: 

1954 కుంభమేళా: భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఫిబ్రవరి 3న జరిగిన తొక్కిసలాట దేశ చరిత్రలో అతిపెద్ద విషాద సంఘటనగా నిలిచింది. ఈ ప్రమాదంలో 800 మంది ప్రాణాలు కోల్పోగా, 2,000 మంది గాయపడ్డారు. అప్పట్లో ఒక ఏనుగు అదుపుతప్పి పరుగెత్తడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు వార్తలొచ్చాయి. 1986 హరిద్వార్ కుంభమేళా: ఏప్రిల్ 14న హరిద్వార్‌లో జరిగిన ఈ ఘటనలో 200 మంది మరణించారు. అప్పటి ఉత్తరప్రదేశ్ సీఎం వీర్‌బహదూర్ సింగ్ ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్లమెంట్ సభ్యులతో కలిసి హరిద్వార్‌ చేరుకున్నారు. రద్దీ నియంత్రణలో విఫలమవ్వడంతో ప్రమాదం చోటుచేసుకుంది.

వివరాలు 

మహా కుంభ్ 2025: గుంపు నియంత్రణ చర్యలు 

2003 నాసిక్ కుంభమేళా: మహారాష్ట్రలోని నాసిక్‌లో గోదావరి నదిలో స్నానం చేయడానికి భక్తులు భారీగా తరలివచ్చారు. తీవ్ర తొక్కిసలాట జరగడంతో 39 మంది ప్రాణాలు కోల్పోయారు. 2013 అలహాబాద్ కుంభమేళా: ఫిబ్రవరి 10న అలహాబాద్‌లోని ఫుట్ బ్రిడ్జి కూలి 42 మంది భక్తులు మరణించారు. ఈసారి, మహా కుంభ్ నిర్వాహకులు 113 అండర్ వాటర్ డ్రోన్లు, ఏఐ ఆధారిత కెమెరాలతో సహా అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించారు. దీని కోసం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఉత్సవ ప్రదేశంలో దాదాపు 300 కెమెరాలను ఏర్పాటు చేశారు.అదనంగా, ఓవర్‌హెడ్ డ్రోన్‌లు మోహరించారు. ఈ తరహా ఘటనలు భక్తులకు,అధికారులకు గుణపాఠంగా మారాలి. భవిష్యత్తులో ఇలాంటి విషాదాలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.