Dhananjay Munde: బీడ్ సర్పంచ్ హత్య కేసు ఆరోపణలు.. మహారాష్ట్ర మంత్రి రాజీనామా
ఈ వార్తాకథనం ఏంటి
మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో సర్పంచ్ దారుణ హత్య ఘటన తీవ్ర రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది.
ఈ సంఘటనకు బాధ్యత వహిస్తూ ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి ధనంజయ్ ముండే (Dhananjay Munde) తన మంత్రి పదవికి రాజీనామా చేశారు.
సర్పంచ్ సంతోష్ దేశ్‌ముఖ్ హత్య కేసులో ఆయనపై ఆరోపణలు రావడంతో, సీఎం దేవేంద్ర ఫడణవీస్ ఆయనను మంత్రి పదవికి రాజీనామా చేయాలని ఆదేశించినట్లు సమాచారం.
దీని మేరకు, ధనంజయ్ ముండే తన రాజీనామాను సమర్పించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
ఈ వ్యవహారంపై స్పందించిన ఫడణవీస్, ధనంజయ్ ముండే రాజీనామాను ఆమోదించి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌కు పంపినట్లు తెలిపారు.
వివరాలు
ప్రతిపక్షాలు డిమాండ్
ఎన్సీపీ అజిత్ పవార్ వర్గంలో కీలక నేతగా ఉన్న ధనంజయ్ ముండే స్వస్థలమైన బీడ్ జిల్లాలో మసాజోగ్ గ్రామ సర్పంచ్ సంతోష్ దేశ్‌ముఖ్‌ను కిడ్నాప్ చేసి, చిత్రహింసలు పెట్టి హత్య చేసిన ఘటన తీవ్ర సంచలనం రేపింది.
ఈ కేసులో ముండే సన్నిహితుడైన వాల్మిక్ కరాడ్‌ను పోలీసులు అరెస్టు చేశారు.
దీంతో, ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి పదవి నుంచి ఆయన రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు తీవ్రంగా డిమాండ్ చేశాయి.
వివరాలు
అజిత్ పవార్ రాజీనామా చేయమని కోరితే..
ఇదే సమయంలో, మంత్రి ధనంజయ్ ముండేకు ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ మద్దతు ఇస్తున్నప్పటికీ, మంత్రిపై ఉన్న ఆధారాలను తాను సమర్పించినట్లు సామాజిక కార్యకర్త అంజలి దమానియా పేర్కొన్నారు.
దీంతో ముండే రాజీనామా చేయాలన్న డిమాండ్లు మరింత బలంగా వినిపించాయి.
ఎన్సీపీ (శరద్ పవార్) కార్యనిర్వాహక అధ్యక్షురాలు సుప్రియా సూలే సైతం ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ఈ పరిణామాల నేపథ్యంలో, ఇటీవల ధనంజయ్ ముండే మాట్లాడుతూ, సీఎం దేవేంద్ర ఫడణవీస్ లేదా డిప్యూటీ సీఎం అజిత్ పవార్ రాజీనామా చేయమని కోరితే తాను వెంటనే రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు.