Basara Temple : బాసర జ్ఞాన సరస్వతి ఆలయానికి మహర్దశ.. రూ.225 కోట్ల భారీ అభివృద్ధి పనులు ప్రారంభం
ఈ వార్తాకథనం ఏంటి
దక్షిణ భారతదేశంలో అక్షరాభ్యాసానికి ప్రసిద్ధిగాంచిన బాసర జ్ఞాన సరస్వతి ఆలయం మహత్తర మార్పులకు సిద్ధమవుతోంది. తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాచీన ఆలయాన్ని సమగ్రంగా పునరాభివృద్ధి చేయాలని నిర్ణయించి, రూ.225 కోట్ల భారీ బడ్జెట్‌ను కేటాయించింది. ఈ అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం (ఏప్రిల్ 6) శంకుస్థాపన చేయనున్నారు. వేదవ్యాస మహర్షి ప్రతిష్టించిన ముగ్గురు అమ్మల ఆలయంగా విశేష ప్రాముఖ్యత కలిగిన బాసర జ్ఞాన సరస్వతి దేవాలయం, సంప్రదాయ ఆచారాలకు అనుగుణంగా ఆధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దబడనుంది. ఇందులో భాగంగా సమున్నతమైన రాజగోపురం, కోనేరు, ఉత్తర ద్వారం అభివృద్ధి, ధ్యాన మందిరాలు వంటి నిర్మాణాలు భక్తులను మరింతగా ఆకట్టుకోనున్నాయి.
వివరాలు
నమూనా చిత్రాలను విడుదల
వేల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయ పునర్నిర్మాణానికి ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ రూపొందించింది. ఆదివారం ఈ ప్లాన్‌కు సంబంధించిన నమూనా చిత్రాలను విడుదల చేసింది. ప్రభుత్వ వివరాల ప్రకారం ఇప్పటికే రూ.225 కోట్లను కేటాయించగా, పనులకు శ్రీకారం చుట్టేందుకు సీఎం భూమిపూజ చేయనున్నారు. పవిత్ర గోదావరి నది ఒడ్డున ఉన్న ఈ ఆలయాన్ని 'దక్షిణ గంగా'గా కూడా పిలుస్తారు. ప్రతేడాది లక్షలాది మంది భక్తులు ఇక్కడికి తరలి వస్తుంటారు. ీముఖ్యంగా అక్షరాభ్యాసం కోసం వచ్చే వారి సంఖ్య అధికంగా ఉంటుంది. అయితే ప్రస్తుతానికి తగిన సౌకర్యాలు లేకపోవడంతో భక్తులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఈ సమస్యలకు పరిష్కారం చూపాలని ప్రభుత్వం నిర్ణయించింది.
వివరాలు
మూడు దిశల్లో ఏడు అంతస్తుల గోపురాలు
శృంగేరి పీఠాధిపతులతో చర్చలు జరిపిన అనంతరం వారి సూచనల మేరకు ఈ మాస్టర్ ప్లాన్ రూపొందించారు. ఇందులో గర్భగుడి, అర్థ మండపం, రాజగోపురం, ఇతర గోపురాలు, మాడ వీధులు, కోనేరు, ఉత్తర ద్వారం నిర్మాణాలకు సంబంధించిన సూచనలు పరిగణనలోకి తీసుకున్నారు. భక్తుల రద్దీ పెరుగుతున్న దృష్ట్యా గర్భగుడి, అర్థ మండపం విస్తీర్ణాన్ని ప్రస్తుత 2,000 చదరపు అడుగుల నుండి 5,000 చదరపు అడుగులకు పెంచనున్నారు. మొత్తం ఆలయ విస్తీర్ణం 20,000 చదరపు అడుగుల నుండి 62,000 చదరపు అడుగులకు విస్తరించబడుతుంది. అలాగే ఉత్తర దిశలో తొమ్మిది అంతస్తుల రాజగోపురం, మిగతా మూడు దిశల్లో ఏడు అంతస్తుల గోపురాలు నిర్మించనున్నారు.
వివరాలు
70 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో క్యూ కాంప్లెక్స్‌లు
ఆలయాన్ని చుట్టుముట్టేలా నాలుగు వైపులా 33 అడుగుల వెడల్పుతో మాడ వీధులు ఏర్పాటు చేయబడతాయి. ఉత్తర ముఖద్వారం నిర్మాణం కూడా ప్రణాళికలో భాగం. ఆలయ నిర్మాణంలో పూర్తిగా రాతి వినియోగానికి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. భక్తుల సౌకర్యార్థం 6 వేల మంది ఒకేసారి ఉండగలిగే విధంగా 70 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో క్యూ కాంప్లెక్స్‌లు నిర్మించనున్నారు. ఇందులో ఫీడింగ్ రూమ్స్, ఫుడ్ స్టాల్స్, టాయిలెట్స్ వంటి సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. ఇక 200 మంది ఏకకాలంలో ధ్యానం చేసుకునేలా ప్రత్యేక ధ్యాన మందిరం, 20 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో వంటశాల, భోజనశాలలు, ప్రసాద పంపిణీ కేంద్రం ఏర్పాటు చేయబడుతుంది. ఈశాన్య దిశలో కోనేరు నిర్మించనున్నారు.
వివరాలు
స్పష్టమైన ఆదేశాలిచ్చిన సీఎం
ఆలయానికి ఉత్తర, తూర్పు వైపుల రహదారి అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. అదనంగా సోలార్ పైకప్పుతో వాహన పార్కింగ్ సదుపాయం కల్పించనున్నారు. ఆలయ ప్రాంగణంలో పచ్చదనంతో కూడిన పూల తోటను అభివృద్ధి చేయడమే కాకుండా, వెలుపల ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వచ్చే ఏడాది జూన్‌లో ప్రారంభమయ్యే గోదావరి పుష్కరాల దృష్ట్యా లక్షలాది మంది భక్తులు బాసరకు రానున్నారు. ఈ నేపథ్యంలో భక్తులకు అవసరమైన అన్ని సౌకర్యాలను సమకూర్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆలయ సంప్రదాయాలు, భక్తుల విశ్వాసాలకు భంగం కలగకుండా అభివృద్ధి పనులు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.