LOADING...
Telangana: మొక్కజొన్న రైతులకు ఊరట.. నేటి నుంచి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
మొక్కజొన్న రైతులకు ఊరట.. నేటి నుంచి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

Telangana: మొక్కజొన్న రైతులకు ఊరట.. నేటి నుంచి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 20, 2026
10:06 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలో మొక్కజొన్న రైతులకు ఊరట కల్పించే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని మార్క్‌ఫెడ్‌కు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు శుక్రవారం నుంచే కొనుగోళ్లు మొదలుకానున్నాయి. ఈ యాసంగి సీజన్‌లో రాష్ట్రవ్యాప్తంగా రైతులు రికార్డు స్థాయిలో మొక్కజొన్న సాగు చేశారు. మొత్తం 11,21,494ఎకరాల్లో పంట పండించగా,దాదాపు 29.79లక్షల టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే పంట మార్కెట్‌లోకి చేరడం ప్రారంభమైంది. అయితే అధిక ఉత్పత్తి, ఇతర మార్కెట్ పరిస్థితుల కారణంగా మొక్కజొన్నకు డిమాండ్ తగ్గింది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర క్వింటాలుకు రూ.2,400గా ఉన్నప్పటికీ, ప్రస్తుతం వ్యాపారులు కేవలం రూ.1,600 నుంచి రూ.1,800 మధ్యే కొనుగోలు చేస్తున్నారు.

వివరాలు 

12 జిల్లాల్లో తొలి దశలో 20 కొనుగోలు కేంద్రాలు

దీంతో రైతులు నష్టపోతున్న పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని సంప్రదించింది. మొక్కజొన్న కొనుగోళ్లకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. రాష్ట్రంలో సుమారు 29 లక్షల టన్నుల ఉత్పత్తి ఉండగా,అందులో 25శాతం పరిమితి మేరకు 8 లక్షల టన్నుల కొనుగోళ్లకు కేంద్ర ప్రభుత్వం బుధవారం అంగీకారం తెలిపింది. ఈ పరిమితి పూర్తయిన తర్వాత మద్దతు ధరకు కొనుగోళ్లపై రాష్ట్రం తదుపరి నిర్ణయం తీసుకోనుంది. మొదటగా, మొక్కజొన్నలు ఎక్కువగా మార్కెట్‌కు చేరుతున్న 12 జిల్లాల్లో 20 కొనుగోలు కేంద్రాలను శుక్రవారం మార్క్‌ఫెడ్ ప్రారంభించనుంది. ఈ కేంద్రాల్లో క్వింటాలుకు రూ.2,400 మద్దతు ధరకు కొనుగోలు జరుగుతుంది. అనంతరం మిగిలిన జిల్లాల్లో కూడా కేంద్రాలను దశలవారీగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Advertisement