Mumbai Airport: ముంబై విమానాశ్రయంలో తృటిలో తప్పిన పెను ప్రమాదం.. ఒకే రన్‌వేపై రెండు విమానాలు
ఈ వార్తాకథనం ఏంటి
ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మంగళవారం రాత్రి భారీ విమాన ప్రమాదం తృటిలో తప్పింది. ఒకే రన్‌వేపై ఒకేసారి రెండు విమానాలు ఉండటంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అయితే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్(ATC)అధికారులు, పైలట్లు సమయానికి అప్రమత్తంగా స్పందించడంతో వందలాది మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఎలా చోటుచేసుకుంది? అందిన వివరాల ప్రకారం..పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురి నుంచి బయలుదేరిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం(AIX1547 - Boeing 737 MAX 8)ముంబై విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయింది. అయితే ల్యాండింగ్ అనంతరం ఆ విమానం ఇంకా రన్‌వేను పూర్తిగా ఖాళీ చేయకముందే,ముంబై నుంచి ఢిల్లీకి వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం(AI816 - Boeing 777-300)అదే రన్‌వేపై టేకాఫ్ ప్రక్రియను ప్రారంభించింది.
వివరాలు
ఏటీసీ చొరవతో తప్పిన ప్రమాదం
టేకాఫ్ కోసం విమానం వేగం పెంచుతుండగా, మరో విమానం ఇంకా రన్‌వేపైనే ఉండటాన్ని గుర్తించడంతో క్షణాల్లోనే ప్రమాదకర పరిస్థితి ఏర్పడింది. రెండు విమానాలు ఒకే రన్‌వేపై ఉన్న విషయాన్ని గుర్తించిన వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారులు అత్యవసరంగా స్పందించారు. టేకాఫ్‌కు సిద్ధమవుతున్న ఎయిర్ ఇండియా విమాన పైలట్‌కు వెంటనే టేకాఫ్‌ను నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఏటీసీ సూచనలు అందుకున్న పైలట్ వెంటనే విమానం వేగాన్ని తగ్గించి టేకాఫ్‌ను రద్దు చేశాడు. అనంతరం విమానాన్ని సురక్షితంగా పార్కింగ్ బే వైపు మళ్లించాడు. దీంతో పెను ప్రమాదం క్షణాల్లో తప్పిపోయింది.
వివరాలు
ఎయిర్ ఇండియా ఏమంది?
ఈ ఘటనపై ఎయిర్ ఇండియా అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి సూచనలు అందిన వెంటనే విమాన సిబ్బంది టేకాఫ్‌ను నిలిపివేసి, విమానాన్ని సురక్షితంగా తిరిగి బేకు తరలించినట్లు వెల్లడించింది. అలాగే సంస్థ ప్రామాణిక నిర్వహణ విధానాల (SOPs) ప్రకారం సంబంధిత విమానానికి అవసరమైన సాంకేతిక తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపింది. ప్రయాణికులకు ప్రత్యామ్నాయ విమానం ఈ ఘటన కారణంగా ఢిల్లీకి వెళ్లాల్సిన ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా మరో విమానాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఎయిర్ ఇండియా వెల్లడించింది. ప్రభావిత ప్రయాణికులను వీలైనంత త్వరగా వారి గమ్యస్థానానికి చేరవేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది.
వివరాలు
సమయస్ఫూర్తితో కాపాడిన వందలాది ప్రాణాలు
ఏటీసీ అధికారులు, పైలట్లు క్షణాల్లో స్పందించకపోయి ఉంటే ఒకే రన్‌వేపై రెండు భారీ విమానాలు ఉండటంతో తీవ్రమైన ప్రమాదం సంభవించే అవకాశం ఉండేది. వారి అప్రమత్తత, సమయస్ఫూర్తి కారణంగానే వందలాది మంది ప్రయాణికుల ప్రాణాలు సురక్షితంగా నిలిచాయని విమానయాన వర్గాలు పేర్కొంటున్నాయి.