LOADING...
Telangana Intermediate: ఇంటర్‌లో భారీ మార్పులు.. ఫస్టియర్‌ నుంచే ప్రయోగ పరీక్షలు
ఇంటర్‌లో భారీ మార్పులు.. ఫస్టియర్‌ నుంచే ప్రయోగ పరీక్షలు

Telangana Intermediate: ఇంటర్‌లో భారీ మార్పులు.. ఫస్టియర్‌ నుంచే ప్రయోగ పరీక్షలు

వ్రాసిన వారు Sirish Praharaju
May 15, 2026
08:17 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలో ఇంటర్‌ విద్యా విధానంలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టారు. కొత్త విద్యాసంవత్సరం 2026-27 నుంచి ప్రథమ సంవత్సర విద్యార్థులకు కూడా ప్రయోగ పరీక్షలు నిర్వహించాలని ఇంటర్‌ బోర్డు నిర్ణయించింది. ఇప్పటివరకు ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు ద్వితీయ సంవత్సరంలో మాత్రమే ప్రయోగ పరీక్షలు ఉండేవి. ఇకపై ఫస్టియర్‌లో 15 మార్కులు, సెకండియర్‌లో మరో 15 మార్కులతో ప్రయోగ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ విద్యాసంవత్సరంలో ప్రథమ సంవత్సరానికి మాత్రమే కొత్త విధానం అమల్లోకి రానుండగా.. 2027-28 నుంచి ద్వితీయ సంవత్సరానికీ వర్తింపజేయనున్నారు. ఈ మార్పులపై విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా, తెలుగు అకాడమీ ఇన్‌ఛార్జి సంచాలకురాలు శ్రీదేవసేన, ఇంటర్‌బోర్డు కార్యదర్శి అభిలాష అభినవ్‌ విస్తృతంగా చర్చించారు. అనంతరం ఇంటర్‌బోర్డు అధికారిక ప్రకటన విడుదల చేసింది.

వివరాలు 

ఎంపీసీ, బైపీసీల్లో 15 మార్కులకు ప్రాక్టికల్స్

కొత్త విధానం ప్రకారం ఎంపీసీ విభాగంలో భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రాలకు ఫస్టియర్‌లోనే 15 మార్కుల చొప్పున ప్రయోగ పరీక్షలు నిర్వహిస్తారు. దీంతో మొదటి ఏడాదిలోనే మొత్తం 30 మార్కులకు ప్రయోగ పరీక్షలు ఉండనున్నాయి. గణితంలో కూడా మార్పులు చేపట్టారు. ఇప్పటివరకు 75 మార్కులకు రాత పరీక్ష నిర్వహించగా..ఇకపై దానిని 60 మార్కులకు పరిమితం చేయనున్నారు. మిగిలిన 15 మార్కులను యాక్టివిటీ ఆధారిత అభ్యాసానికి కేటాయిస్తారు. గణితంలో రెండు పత్రాలు ఉండటంతో ప్రథమ సంవత్సరంలోనే యాక్టివిటీ ఆధారిత విధానానికి మొత్తం 30 మార్కులు కేటాయించనున్నారు. ఇతర విభాగాల్లోని వాణిజ్యం, లెక్కలు, రాజకీయ శాస్త్రం, చరిత్ర, భూగోళ శాస్త్రం, ప్రజాపాలన వంటి అంశాలకు 80 మార్కుల రాత పరీక్షతో పాటు 20 మార్కుల అంతర్గత పరీక్షలు నిర్వహించనున్నారు.

వివరాలు 

కొత్త సిలబస్‌తో కూడిన పాఠ్య పుస్తకాలను జూన్‌ 1 నాటికి పంపిణీ

అలాగే తెలుగు, సంస్కృతం, ఆంగ్లం తదితర భాషా విషయాలకు కూడా 80 మార్కుల రాత పరీక్ష, 20 మార్కుల అంతర్గత మూల్యాంకనం అమలు చేయనున్నారు. ఈసారి కొత్తగా లెక్కలు-వాణిజ్యం-ఆర్థికశాస్త్రం విభాగాన్ని కూడా ప్రారంభిస్తున్నట్లు బోర్డు వెల్లడించింది. ఇదిలా ఉండగా.. ప్రథమ సంవత్సరం విద్యార్థులకు కొత్త పాఠ్యాంశాలతో రూపొందించిన పుస్తకాలను జూన్‌ 1 నాటికి అందజేస్తామని ఇంటర్‌బోర్డు స్పష్టం చేసింది. కొత్త పాఠ్యపుస్తకాల పంపిణీపై వచ్చిన వార్తలకు స్పందించిన బోర్డు.. మరో రెండు మూడు రోజుల్లో పంపిణీ ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపింది. అయితే ఇవి ఉచిత పుస్తకాలా? లేక విక్రయానికి ఉంచే పుస్తకాలా? అన్న అంశంపై మాత్రం ఇంకా స్పష్టత ఇవ్వలేదు.

Advertisement