Delhi Fire Accident : ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం.. ఫ్యాక్టరీలో నలుగురు కార్మికులు మృతి
ఈ వార్తాకథనం ఏంటి
దేశ రాజధాని దిల్లీలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మంగోల్‌పురి ప్రాంతంలోని ఓ ఫ్యాక్టరీలో రాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో నలుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. మంగోల్‌పురిలోని ఓ పాదరక్షల తయారీ పరిశ్రమ బేస్‌మెంట్‌లో రాత్రి సమయంలో అగ్నిప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తమయ్యారు. మొత్తం 20 ఫైర్ ఇంజన్లతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఫ్యాక్టరీలో చిక్కుకున్న మరో ఆరుగురిని రెస్క్యూ బృందాలు సురక్షితంగా బయటకు తీసుకొచ్చాయి.
వివరాలు
సహాయక చర్యలకు తీవ్ర అంతరాయం
ఈ ప్రమాదంలో గాయపడిన ఇద్దరిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే నలుగురు కార్మికులు మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు.
ఫ్యాక్టరీలో పాదరక్షల తయారీకి ఉపయోగించే రబ్బరు నిల్వలు భారీగా ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించి ఉంటాయని అధికారులు భావిస్తున్నారు.
మరోవైపు ప్రమాదం కారణంగా పరిసర ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్ముకోవడంతో సహాయక చర్యలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
ఈ అగ్నిప్రమాదానికి ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై వివరాలు సేకరిస్తున్నారు.