LOADING...
Indian cities sinking: భారత ప్రధాన నగరాలు కుంగిపోతున్నాయ్.. భూగర్భజలాల అధిక వినియోగమే కారణమంటున్న నూతన అధ్యయనం
భూగర్భజలాల అధిక వినియోగమే కారణమంటున్న నూతన అధ్యయనం

Indian cities sinking: భారత ప్రధాన నగరాలు కుంగిపోతున్నాయ్.. భూగర్భజలాల అధిక వినియోగమే కారణమంటున్న నూతన అధ్యయనం

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 29, 2025
04:23 pm

ఈ వార్తాకథనం ఏంటి

భూగర్భజలాలను అతిగా తవ్వడం వల్ల దేశంలోని ప్రధాన నగరాలు క్రమంగా కుంగిపోతున్నాయని ఒక తాజా పరిశోధనలో తేలింది. 'నేచర్ సస్టైనబిలిటీ' అనే శాస్త్రీయ పత్రికలో ప్రచురితమైన ఈ అధ్యయనం ప్రకారం, దాదాపు 878 చదరపు కిలోమీటర్ల పట్టణ భూభాగం కుంగిపోతున్నదని తెలిపారు. దీని వల్ల న్యూ ఢిల్లీ, ముంబై, చెన్నై వంటి నగరాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి పెద్ద ప్రమాదం తలెత్తే అవకాశముందని హెచ్చరించారు.

అధ్యయన ఫలితాలు 

2,400 కట్టడాలు ప్రమాదంలో..

2015 నుండి 2023 మధ్యకాలంలో ఉపగ్రహ రాడార్‌ డేటా ఆధారంగా ఈ అధ్యయనం జరిపారు. ఐదు ప్రధాన నగరాల్లోని దాదాపు 1.3 కోట్లు భవనాలను పరిశీలించగా, అందులో 2,400 కట్టడాలు తీవ్రమైన ప్రమాదంలో ఉన్నాయని, మరో 20 వేల భవనాలు వచ్చే 50 ఏళ్లలో కుంగిపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. "నగరాలు ప్రకృతి పునరుత్పత్తి చేయగలదానికంటే ఎక్కువగా భూగర్భజలాలను పంప్ చేసుకుంటే, నేల నిజంగానే కుంగిపోతుంది," అని ఈ అధ్యయనానికి సహ రచయిత సుసానా వెర్త్ తెలిపారు.

భూగర్భ జలాల వినియోగం 

భూగర్భజలాలను అత్యధికంగా వినియోగించే దేశంగా భారత్

2022లో విడుదలైన ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం, భారతదేశం ప్రపంచంలోనే ఎక్కువ భూగర్భజలాలను వినియోగించే దేశం. చైనా, అమెరికా రెండింటి కలిపినదానికంటే భారత్ ఒంటరిగా ఎక్కువ నీటిని తవ్వుకుంటుందట. ఇప్పటికే దేశంలోని దాదాపు 63 శాతం జిల్లాలు నీటి కొరత ప్రమాదంలో ఉన్నాయంటూ నివేదిక తెలిపింది. వ్యవసాయ రంగమే ఈ నీటి వినియోగంలో ప్రధాన భాగాన్ని ఆక్రమిస్తోంది. అయితే చాలా ప్రాంతాలు ఇప్పటికే తీవ్రమైన నీటి ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.

మౌలిక సదుపాయాలకు ముప్పు 

కుంగిపోతున్న భూమి.. వరదలు, భూకంపాల ముప్పు పెరుగుతోంది

భూమి కుంగిపోవడం వల్ల వరదలు, భూకంపాల ప్రమాదం మరింత పెరుగుతుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. అసమానంగా కుంగిపోవడం వలన భవనాల పునాదులు బలహీనపడటం, పైపులైన్లు, విద్యుత్ లైన్లు దెబ్బతినే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ఈ సమస్య భారత్‌కే పరిమితం కాదని, వెనిస్‌, బ్యాంకాక్‌, న్యూజెర్సీ వంటి నగరాలు కూడా ఇదే సమస్యతో తంటాలు పడుతున్నాయని తెలిపారు. అంతేకాక, ఇండోనేషియా రాజధాని జకార్టా కూడా కుంగిపోతుండటంతో కొత్త రాజధానిని నిర్మించేందుకు సిద్ధమవుతోంది.