Kolkata Protest: కోల్‌కతా వీధుల్లో SIR కు వ్యతిరేకంగా మమతా బెనర్జీ నిరసన ర్యాలీ
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోల్‌కతా వీధుల్లో మంగళవారం విస్తృత నిరసన ర్యాలీని నిర్వహించారు. ఇది "స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)" పేరుతో జరుగుతున్న ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమానికి వ్యతిరేకంగా జరిగింది. ఈ ర్యాలీలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ప్రముఖ నాయకులు, కార్యకర్తలు, అలాగే పెద్ద సంఖ్యలో సాధారణ ప్రజలు పాల్గొన్నారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణల ప్రకారం.. ఈ సవరణ డ్రైవ్ అసలు ఎన్నికల సంఘంతో కలిసి బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న "నిశ్శబ్ద, అదృశ్య రిగ్గింగ్"కు మరో రూపం అని పేర్కొంది.
వివరాలు
మమతా బెనర్జీ ఏం అన్నారంటే..
ర్యాలీ అనంతరం మమతా బెనర్జీ మాట్లాడుతూ, "అనేక అసంఘటిత రంగ కార్మికులు తమ పేర్లు ఓటర్ల జాబితా నుంచి తొలగించబడతాయేమోనని ఆందోళన చెందుతున్నారు. బంగ్లాలో మాట్లాడటం అంటే ఎవరు బంగ్లాదేశీయులని కాదు, అలాగే హిందీ లేదా పంజాబీ మాట్లాడటం అంటే పాకిస్థానీయులని కూడా కాదు. కానీ బంగ్లాలో మాట్లాడే వారిని బంగ్లాదేశీయులుగా ముద్ర వేయడం తగదు. దేశ స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొనని ఈ అజ్ఞానులు ఇప్పుడు దేశభక్తి పాఠాలు చెబుతున్నారు. ఆ సమయంలో బీజేపీ ఎక్కడ ఉంది? భారతదేశం, బంగ్లాదేశ్, పాకిస్థాన్.. ఇవన్నీ ఒకే భూభాగంలో భాగాలు అని వారికి తెలుసు కావాలి," అని ఆమె విమర్శించారు.
వివరాలు
వేలాది మంది మద్దతుదారులతో ర్యాలీ
అలాగే ఆమె బీజేపీని "దోపిడీ,తప్పుడు ప్రచార పార్టీ"గా అభివర్ణిస్తూ, "వారు అనేక ఏజెన్సీలను తమ ప్రయోజనాలకు వాడుకుంటున్నారు,నకిలీ వార్తలు, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారు. కానీ ప్రజలు ఇక మోసపోవడం లేదు.. భవిష్యత్తులో వారు అధికారంలో నిలబడరు," అని హెచ్చరించారు. మమతా బెనర్జీ తన మేనల్లుడు, తృణమూల్ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీతో కలిసి నగరం నడిబొడ్డున వేలాది మంది మద్దతుదారులతో ర్యాలీకి నాయకత్వం వహించారు. ఈ నిరసన బీఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రారంభమై సుమారు 3.8 కిలోమీటర్ల మేర కొనసాగింది. టీఎంసీ కార్యకర్తలు, అనుకూలులు పార్టీ జెండాలు ఊపుతూ, నినాదాలు చేస్తూ, "SIR వ్యతిరేకంగా" నినాదాలతో ప్లకార్డులు పట్టుకొని ప్రదర్శనలు నిర్వహించారు.
వివరాలు
అభిషేక్ బెనర్జీ వ్యాఖ్యలు
ఈ సందర్భంగా అభిషేక్ బెనర్జీ మాట్లాడుతూ, "SIR ప్రక్రియ చుట్టూ వ్యాపించిన భయం ఇప్పటికే అనేక మందిని ప్రాణాలు కోల్పోయే పరిస్థితికి నెట్టేసింది. గత వారం రోజులలో భయంతో ఏడుగురు వ్యక్తులు మరణించారు. తమ ఓటు హక్కులు కోల్పోతామేమోనని వారు తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉన్నారు. వారి కుటుంబ సభ్యులు నేటి ర్యాలీలో మాతో చేరారు," అని అన్నారు.