TMC: ఓటరు జాబితా సవరణతో ఫలితాలు మారాయన్న టీఎంసీ.. స్పందించిన సుప్రీం
ఈ వార్తాకథనం ఏంటి
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియపై దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించింది. ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్ పలు కీలక వాదనలు వినిపించింది. ఓటర్ల పేర్ల తొలగింపుల కారణంగా ఎన్నికల ఫలితాలు ప్రభావితమయ్యాయని పార్టీ పేర్కొంది. అనేక నియోజకవర్గాల్లో స్వల్ప ఓట్ల తేడాతో పరాజయం ఎదురైందని తెలిపింది. తొలగించిన ఓట్ల పునరుద్ధరణ కోసం వేల సంఖ్యలో దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నప్పటికీ వాటిని పరిష్కరించకుండానే ఎన్నికలు నిర్వహించారని ఆరోపించింది. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు అధికంగా ఉన్న 31అసెంబ్లీ స్థానాల్లో వందల ఓట్ల తేడాతో ఓడిపోయామని టీఎంసీ వెల్లడించింది. ఒక నియోజకవర్గంలో తమ అభ్యర్థి కేవలం 862 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారని, అక్కడ ఓటర్ల జాబితా నుంచి ఐదువేలకుపైగా పేర్లు తొలగించారని ఆరోపించింది.
వివరాలు
స్వల్ప తేడాతో ఓటమి ఎదురైతే బాధితులు మళ్లీ దరఖాస్తు చేసుకునే అవకాశం
రాష్ట్రవ్యాప్తంగా తమ పార్టీ, భారతీయ జనతా పార్టీ మధ్య మొత్తం ఓట్ల తేడా సుమారు 32 లక్షలు మాత్రమే ఉండగా.. ఓట్ల తొలగింపులకు వ్యతిరేకంగా వచ్చిన అప్పీలు 35 లక్షలకు మించాయని పేర్కొంది. ఈ పరిస్థితులే ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేశాయని టీఎంసీ వాదించింది. ఈ వాదనలపై సుప్రీంకోర్టు స్పందించింది.ఓటర్ల పేర్ల తొలగింపులు జరిగిన ప్రాంతాల్లో స్వల్ప తేడాతో ఓటమి ఎదురైతే బాధితులు మళ్లీ దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది. సంబంధిత నియోజకవర్గాల ఓటర్లు లేదా రాజకీయ పార్టీలు కొత్తగా పిటిషన్లు దాఖలు చేయవచ్చని తెలిపింది. అలాంటి వ్యవహారాలను పరిశీలించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జయమాల్య బాగ్చీ సభ్యులుగా ఉన్న ధర్మాసనం పేర్కొంది.