Mamata Banerjee: మమతా బెనర్జీ కాన్వాయ్‌పై చెప్పులు, రాళ్లతో దాడి : బెంగాల్‌లో ఉద్రిక్తత
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర 24 పరగణాల జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీకి నిరసన సెగ తగిలింది. హాలిసహర్‌లో ఆమె ప్రయాణిస్తున్న కారును ఆందోళనకారులు చుట్టుముట్టి నిరసన తెలిపారు. ఈ క్రమంలో కారుపై బురద రాయడంతో పాటు బూట్లు, నీళ్ల సీసాలు విసిరినట్లు తెలుస్తోంది. అలాగే ఇటుకలు, రాళ్లతోనూ దాడి చేసినట్లు మమతా బెనర్జీ ఆరోపించారు. తనపై జరిగిన దాడిలో ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని మమత పేర్కొన్నారు. ఈ హింసాత్మక ఘటనను రాష్ట్ర బీజేపీ తీవ్రంగా ఖండించింది. దాడితో తమ పార్టీకి, కార్యకర్తలకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది.
వివరాలు
పోలీసుల అదుపులో టీఎంసీ కార్యకర్త మృతి
పోలీస్ కస్టడీలో టీఎంసీ కార్యకర్త బిర్జు కియోట్ మరణించాడన్న ఆరోపణల నేపథ్యంలో బెంగాల్‌లో ఆ పార్టీ తీవ్ర నిరసనలు చేపడుతోంది.
ఈ నేపథ్యంలో మమతా బెనర్జీ.. మృతుడి కుటుంబాన్ని పరామర్శించేందుకు, అతడి ఇంటికి వెళ్లేందుకు బయలుదేరారు.
అయితే హాలిసహర్‌లో ఆమెకు ఆందోళనకారుల నుంచి నిరసన ఎదురైంది. మమతా బెనర్జీ కాన్వాయ్‌ను నిరసనకారులు అడ్డుకుని ఆమె కారును చుట్టుముట్టారు.
కారుపై బురద రాయడంతో పాటు బూట్లు, నీళ్ల సీసాలు విసిరారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు ఆందోళనకారులను వెనక్కి తోసేందుకు ప్రయత్నించారు.
ఈ సందర్భంగా మమతను ఉద్దేశించి ''దొంగను తరిమికొట్టండి'' అంటూ నినాదాలు చేశారు.
వివరాలు
'తల పగిలి చనిపోయేదాన్ని'
తన కారుపై ఇటుకలు, రాళ్లు పడి ఉంటే తాను చనిపోయి ఉండేదానినని మమతా బెనర్జీ మీడియాతో అన్నారు. బయట నుంచి వచ్చిన సంఘవిద్రోహ శక్తులు పోలీసుల సమక్షంలోనే తన కారుపై దాడి చేశాయని ఆరోపించారు.
'నా కారు కిటికీలు మూసి ఉండకపోతే నా తల పగిలి, నేను చనిపోయేదాన్ని. ఇలాంటి దాడిని నా జీవితంలో ఎప్పుడూ ఎదుర్కోలేదు.
మమ్మల్ని కాపాడేందుకు పోలీసులు ఏమీ చేయలేదు. వారు కేవలం బీజేపీకే రక్షణ కల్పిస్తున్నారని మమత ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ ఘటనను టీఎంసీ లోక్‌సభ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ, రాజ్యసభ ఎంపీ డోలా సేన్ తీవ్రంగా ఖండించారు.
వివరాలు
'దాడిని బీజేపీ సమర్థించదు': బీజేపీ
మమతా బెనర్జీ కాన్వాయ్‌పై జరిగిన దాడిని పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సామిక్ భట్టాచార్య కూడా ఖండించారు.
ఈ ఘటనతో తమ పార్టీ కార్యకర్తలకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. రాళ్లు, బురద, చెప్పులు విసరడాన్ని బీజేపీ ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించదని పేర్కొన్నారు.
ఇలాంటి హింసాత్మక ఘటనలు పశ్చిమ బెంగాల్ ప్రతిష్ఠను దెబ్బతీస్తాయని సామిక్ భట్టాచార్య అన్నారు.
దాడికి బాధ్యులైన వారిపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
వివరాలు
బిర్జు కియోట్ మృతితో వివాదం
టీఎంసీ కార్యకర్త బిర్జు కియోట్ పోలీసుల అదుపులో ఉన్న సమయంలో అనారోగ్యానికి గురై మృతి చెందడంతో ఈ వివాదం మొదలైంది.
పోలీసుల చిత్రహింసల కారణంగానే తమ పార్టీ కార్యకర్త మరణించాడని టీఎంసీ ఆరోపిస్తోంది. ఘటనపై స్వతంత్ర దర్యాప్తు జరపాలని బిర్జు కియోట్ భార్య డిమాండ్ చేస్తున్నారు.
అయితే పోలీసుల వాదన మరోలా ఉంది. బిర్జు కియోట్ గుండెపోటు కారణంగానే మరణించాడని పోలీసులు స్పష్టం చేశారు.
దీంతో ఆయన మృతిపై టీఎంసీ ఆరోపణలు, పోలీసుల వివరణ మధ్య వివాదం కొనసాగుతోంది.