LOADING...
Mamata Banerjee: 'నన్ను రాజకీయంగా అడ్డుకోవాలంటే ప్రాణాలు తీయాల్సిందే'.. మమతా బెనర్జీ తీవ్ర వ్యాఖ్యలు
'నన్ను రాజకీయంగా అడ్డుకోవాలంటే ప్రాణాలు తీయాల్సిందే'.. మమతా బెనర్జీ తీవ్ర వ్యాఖ్యలు

Mamata Banerjee: 'నన్ను రాజకీయంగా అడ్డుకోవాలంటే ప్రాణాలు తీయాల్సిందే'.. మమతా బెనర్జీ తీవ్ర వ్యాఖ్యలు

వ్రాసిన వారు Moogati Shabari
Jul 05, 2026
05:28 pm

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమ బెంగాల్‌లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎదురైన ఘోర ఓటమి అనంతరం తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లో అంతర్గత సంక్షోభం మరింత ముదిరింది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్టీకి వ్యతిరేకంగా గళం విప్పగా, తాజాగా పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ తిరుగుబాటు నేతలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తన రాజకీయ ప్రయాణాన్ని అడ్డుకోవాలంటే తనను చంపాల్సిందేనని వ్యాఖ్యానించిన ఆమె, రెబల్ వర్గాన్ని పార్టీకి ద్రోహం చేసిన వారిగా అభివర్ణించారు. కోల్‌కతాలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన మమతా బెనర్జీ, టీఎంసీ ఎన్నికల గుర్తు తమ ఆధీనంలోనే కొనసాగుతుందని, దానిని ఎవరూ స్వాధీనం చేసుకోలేరని స్పష్టం చేశారు. తిరుగుబాటు వర్గం ఎన్నికల సంఘం ముందు న్యాయపరమైన పోరాటాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొన్నారు.

వివరాలు

మమతా బెనర్జీకి వ్యతిరేకంగా గళం..

ఇదిలా ఉండగా మమతా బెనర్జీకి మరో కీలక ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా, మమతకు అత్యంత సన్నిహితురాలిగా గుర్తింపు పొందిన చంద్రిమా భట్టాచార్య తన అన్ని సంస్థాగత పదవులకు రాజీనామా చేశారు. అనంతరం ఆమె రీటబ్రత బెనర్జీ నేతృత్వంలోని తిరుగుబాటు వర్గంతో కలిసి కనిపించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీని వీడిన నేతలు ఒత్తిళ్లకు లోనై ఆ నిర్ణయం తీసుకున్నారని మమతా ఆరోపించారు. తాను ఎప్పటికీ బీజేపీ ఎదుట తలవంచబోనని స్పష్టం చేసిన ఆమె, టీఎంసీ సిద్ధాంతాలు బీజేపీ విధానాలకు పూర్తిగా భిన్నమైనవని, ఆ పార్టీకి వ్యతిరేకంగానే కొనసాగుతాయని వెల్లడించారు.

వివరాలు

నివాసాన్నే పార్టీ కార్యాలయంగా మార్పు..

పార్టీ ప్రధాన కార్యాలయాన్ని తిరుగుబాటు వర్గం స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారన్న అంశంపై స్పందించిన మమతా, కోల్‌కతాలోని టీఎంసీ కార్యాలయం లీజు ప్రాతిపదికన తీసుకున్న భవనమని, దానిని బలవంతంగా ఆక్రమించడం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. చంద్రిమా భట్టాచార్య రాజీనామా అనంతరం పార్టీ రాష్ట్ర, జాతీయ స్థాయి వ్యవహారాలను ఇకపై తానే నేరుగా పర్యవేక్షిస్తానని మమతా బెనర్జీ వెల్లడించారు. అవసరమైతే తన స్వంత నివాసాన్నే పార్టీ ప్రధాన కార్యాలయంగా ఉపయోగించనున్నట్లు కూడా ప్రకటించారు.

Advertisement