Mamata Banerjee: అన్ని మతాలను గౌరవించాలి: ఉదయనిధి వ్యాఖ్యలపై మమతా బెనర్జీ ఆసక్తికర కామెంట్స్
'సనాతన ధర్మం'పై తమిళనాడు సీఎం ఎంకె స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా రాజకీయ అలజడిని సృష్టిస్తున్నాయి. తాజాగా ఉదయనిధి వ్యాఖ్యలపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. ఉదయనిధి స్టాలిన్ జూనియర్ అని, అతను ఎందుకు అలా మాట్లాడారో స్పష్టంగా తెలియదన్నారు. ప్రతి మతాన్ని సమానంగా గౌరవించాలని తాను అనుకున్నట్లు చెప్పారు. తాను తమిళనాడుతో పాటు దక్షిణ భారతదేశ ప్రజలను గౌరవిస్తానన్నారు. అయితే ప్రతి మతానికి ప్రత్యేక భావాలు ఉన్నందున అందరినీ గౌరవించాలని బెనర్జీ అన్నారు. తాను సనాతన ధర్మాన్ని గౌరవిస్తానని, వేదాల నుంచి చాలా నేర్చుకున్నామని బెనర్జీ పేర్కొన్నారు. తమ రాష్ట్ర ప్రభుత్వం పురోహితులకు పెన్షన్ అందిస్తోందని మమతా అన్నారు.
ఇంతకీ ఉదయనిధి స్టాలిన్ ఏం అన్నారంటే?
ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియాతో పోల్చారు. ఈ వ్యాఖ్యలు దేశంలో రాజకీయ దుమారాన్ని రేపాయి. అలాగే సనాతన ధర్మాన్ని వ్యతిరేకించడమే కాకుండా నిర్మూలించాలన్నారు. సనాతన ధర్మం సామాజిక న్యాయం, సమానత్వానికి విరుద్ధమని ఉదయనిధి స్టాలిన్ అన్నారు. అయితే తన వ్యాఖ్యలు వివాదాస్పమైన నేపథ్యంలో ఉదయనిధి వివరణ ఇచ్చారు. సనాతన ధర్మాన్ని అనుసరించే వ్యక్తులను నిర్మూలించాలని తాను ఎప్పుడూ పిలుపునివ్వలేదని ఉదయనిధి అన్నారు. ద్రావిడ భూమి నుంచి సనాతన ధర్మాన్ని నిర్మూలించాలనే తమ సంకల్పం కొంచెం కూడా తగ్గదని ఆయన స్పష్టం చేశారు.