Mamata Banerjee : మహిళల ప్రపంచకప్ గెలుపుపై మమతా ట్వీట్.. ఘాటుగా కౌంటర్ ఇచ్చిన బీజేపీ!
ఈ వార్తాకథనం ఏంటి
భారత మహిళల క్రికెట్ జట్టు తొలిసారిగా ఐసీసీ ప్రపంచకప్ గెలిచి చరిత్ర సృష్టించిన వేళ, ఆ గర్వకారణమైన విజయం రాజకీయ వాదనలకు వేదికగా మారింది. జట్టును అభినందిస్తూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన ట్వీట్‌కు బీజేపీ ఘాటుగా స్పందించింది. గతంలో మమత మహిళలు రాత్రిపూట బయట తిరగడంపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను గుర్తుచేస్తూ వ్యంగ్యాస్త్రాలు సంధించింది. దీంతో దేశమంతా ఉత్సాహంగా జరుపుకుంటున్న ఈ చారిత్రక గెలుపు రాజకీయ రంగు పులుముకుంది. నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో ఆదివారం జరిగిన ఫైనల్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత్ 52 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించి తొలిసారి మహిళల వన్డే ప్రపంచకప్ ట్రోఫీని కైవసం చేసుకుంది.
Details
అమ్మాయిలు చూపిన అద్భుత ప్రదర్శన దేశానికి గర్వకారణం
ఈ విజయం తర్వాత మమతా బెనర్జీ సోమవారం 'ఎక్స్'లో స్పందిస్తూ మహిళా జట్టును ప్రశంసించారు. ప్రపంచకప్ ఫైనల్‌లో మన అమ్మాయిలు చూపిన అద్భుత ప్రదర్శన దేశ గర్వకారణం. వారి పోరాటపటిమ, నిబద్ధత, పట్టుదల ఎన్నో యువతలకు ప్రేరణనిస్తుంది. మీరు ప్రపంచస్థాయి జట్టు అని నిరూపించుకున్నారు. మీరు మా హీరోలు. మరిన్ని విజయాలు మీ కోసం ఎదురుచూస్తున్నాయి. మేము మీకు అండగా ఉంటామని ఆమె ట్వీట్ చేశారు. అయితే మమతా ఈ ట్వీట్‌పై బీజేపీ ఘాటుగా బదులిచ్చింది. గతనెలలో పశ్చిమ బెంగాల్‌లోని దుర్గాపూర్‌లో జరిగిన అత్యాచార ఘటనపై మమతా చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ పార్టీ అధికారిక ఖాతా నుంచి సెటైరిక్ పోస్ట్ చేసింది. ''అయ్యో! వాళ్లు రాత్రి 12 గంటల వరకు ఆడారు.
Details
చరిత్ర సృష్టించిన టీమిండియా
కానీ మీరు రాత్రి 8 గంటలకే ఇంటికి వెళ్లమన్నారు కదంటూ వ్యాఖ్యానించింది. గత నెల జరిగిన ఆ ఘటనపై మమతా బెనర్జీ మాట్లాడుతూ బాధితురాలు రాత్రి 12.30కి బయట ఎందుకు ఉంది? ముఖ్యంగా ఆడపిల్లలు రాత్రిపూట బయట తిరగకూడదు. వాళ్లను వాళ్లు జాగ్రత్తగా కాపాడుకోవాలని చెప్పడం పెద్ద వివాదంగా మారింది. ఆమె వ్యాఖ్యలు బాధితురాలినే నిందించినట్టుగా ఉన్నాయని విమర్శలు వెల్లువెత్తాయి.ఇప్పుడు అదే వ్యాఖ్యలను బీజేపీ మళ్లీ లేవనెత్తి రాజకీయంగా ఆమెను ఇరుకునపెట్టే ప్రయత్నం చేసింది. మరోవైపు, భారత మహిళల చారిత్రక విజయాన్ని ప్రజలు దేశవ్యాప్తంగా సంబరంగా జరుపుకుంటుండగా, ఈ రాజకీయ తగువులు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. అయితే, ఈ రాజకీయ గందరగోళానికి దూరంగా టీమ్‌ఇండియా చరిత్ర సృష్టించిన గర్వకారణమైన విజయాన్ని ఆస్వాదిస్తోంది.