West Bengal: ఉద్యోగం ఇప్పించమంటూ ఎమ్మెల్యే కడుపుపై పిడిగుద్దులు.. కొట్టిన యువకుడు అరెస్ట్
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమ బెంగాల్‌కు చెందిన తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జ్యోతిప్రియ మల్లిక్‌పై ఆదివారం రాత్రి దారుణ దాడి జరిగింది. సాల్ట్ లేక్‌లోని ఆయన నివాసంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఉద్యోగం ఇప్పించమంటూ మల్లిక్ ఇంటికి వచ్చిన ఓ యువకుడు అకస్మాత్తుగా ఆయనపై దాడి చేసినట్టు పోలీసులు తెలిపారు. ఎమ్మెల్యేను చూసిన వెంటనే ఆ యువకుడు చేతులు, కడుపుపై పిడిగుద్దులు గుద్దడటంతో మల్లిక్ ఒక్కసారిగా తట్టుకోలేక గందరగోళానికి గురయ్యారు. శబ్దం విన్న భద్రతా సిబ్బంది అక్కడికెళ్లి నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనతో రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేగింది.
వివరాలు
ఎమ్మెల్యేను చూడగానే కోపంతో ఊగిపోతూ..
పోలీసుల సమాచారం ప్రకారం,సుమారు 30ఏళ్ల వయస్సున్న అభిషేక్ దాస్ అనే యువకుడు రాత్రి 9గంటల సమయంలో ఎమ్మెల్యే మల్లిక్ ఇంటికి వచ్చాడు. ఉద్యోగం విషయమై మాట్లాడాలనుకుంటున్నానని భద్రతా సిబ్బందికి తెలిపాడు. అలా ఇంట్లోకి చేరుకుని.. ఎమ్మెల్యేను చూడగానే కోపంతో ఊగిపోతూ కడుపుపై పిడిగుద్దులు గుద్దాడు. అకస్మిక దాడితో మల్లిక్ కొద్దిసేపు స్థంభించిపోయారు.అయితే వెంటనే తేరుకుని కేకలు వేయడంతో గమనించిన భద్రతా సిబ్బంది పరుగున వచ్చి నిందితుడిని పట్టుకున్నారు. అనంతరం అతడిని బిధాన్నగర్ పోలీసులకి అప్పగించారు. తదుపరి విచారణలో నిందితుడు నార్త్ 24 పరగణాస్ జిల్లా హబ్రా ప్రాంతానికి చెందినవాడని పోలీసులు గుర్తించారు. ఉద్యోగం కోసం మల్లిక్‌ను కలవాలనుకున్నానని అతడు చెప్పాడు. అయితే అతని కుటుంబ సభ్యులు వెల్లడించిన వివరాలు మరింత షాకింగ్‌గా మారాయి.
వివరాలు
ఘటన వెనుక ఎటువంటి కుట్ర లేదు: పోలీసులు
గతంలో అభిషేక్ దాస్ నగరంలోని ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో మానసిక చికిత్స పొందినట్టు వారు తెలిపారు. అంతేకాక, దాడికి ముందు రోజే అతడు మల్లిక్ ఇంటి చుట్టూ పలుమార్లు తిరిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. దాడి తర్వాత విలేకరులతో మాట్లాడిన జ్యోతిప్రియ మల్లిక్ మాట్లాడుతూ"ఆ వ్యక్తిని నేను ఎప్పుడూ చూడలేదు.అతడు మత్తులో ఉన్నాడా లేదా నాకు తెలియదు. హబ్రాకు చెందిన ఓ వ్యక్తి ఇంతలా నాపై దాడి చేయడం నమ్మశక్యంగా లేదు,"అని అన్నారు. ఈఘటన వెనుక ఎటువంటి కుట్ర లేదని,ఇది ఒక వ్యక్తి చేసిన ఒంటరి చర్యగానే అనిపిస్తోందని చెప్పారు. ప్రస్తుతం పోలీసులు నిందితుడు మానసికసమస్యల కారణంగానే ఈ దాడికి పాల్పడ్డాడా,లేక దీని వెనుక రాజకీయ ఉద్దేశ్యమేమైనా ఉందా అనే అంశాలపై దర్యాప్తు జరుపుతున్నారు.