603 రోజులు 5స్టార్ హోటల్‌లో బస; బిల్లుకట్టకుండానే పారిపోయిన ఘనుడు
ఈ వార్తాకథనం ఏంటి
దిల్లీ ఏరోసిటీలోని లగ్జరీ హోటల్ రోసేట్ హౌస్‌లో ఘరానా మోసం జరిగింది. ఈ 5స్టార్ హోటల్‌లో అంకుష్ దత్తా అనే వ్యక్తి ఒకరోజు కాదు, రెండు రోజులు కాదు ఏకంగా 603రోజులు బస చేసి బిల్లు కట్టకుండా పారిపోయాడు.
ఇది తెలిసిన హోటల్ యాజమాన్యం లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించింది.
ఈ వ్యవహారంపై ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ (ఐజీఐ) విమానాశ్రయం సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
ఎలాంటి బిల్లులు చెల్లించకుండా అంకుష్ దత్తా తమ హోటల్‌లో 603రోజులు ఉన్నాడని, ఇందుకు సంబంధించి అతను తమకు రూ.58లక్షల బిల్లు చెల్లించాలని రోసేట్ హౌస్ హోటయ యాజమాన్యం ఫిర్యాదులో పేర్కొంది.
దిల్లీ
హోటల్ సిబ్బంది సహకారంతోనే అన్నిరోజుల బస
అంకుశ్ దత్తా 2019 మే 30న హోటల్‌లో దిగాడు. అయితే రకరకాలు కారణాలు చెబుతూ తన బసను జనవరి 22, 2021 వరకు పొడిగించారు.
హోటల్ పాలసీ ప్రకారం బిల్లు కట్టకుండా అతిథి తన బసను 72గంటలు పొడిగించుకుంటే సీఈఓ, ఫైనాన్స్ కంట్రోలర్‌కు సమాచారం అందించాలి.
కానీ హోటల్ సిబ్బంది అలా చేయలేదు. ఈ క్రమంలో హోటల్ సిబ్బంది సహకారంతోనే దత్తా బిల్లు చెల్లించకుండా దాదాపు రెండేళ్లు ఉండగలిగాడని యాజమాన్యం అనుమానిస్తోంది.
ముఖ్యంగా హోటల్ ఫ్రంట్ ఆఫీస్ డిపార్ట్‌మెంట్ హెడ్ ప్రేమ్ ప్రకాష్‌పై అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రేమ్ ప్రకాష్ హోటల్ నిబంధనలను విస్మరించి దత్తా స్టేను పొడిగించినట్లు ఎఫ్ఐఆర్‌లో పోలీసులు పేర్కొన్నారు.
దిల్లీ
నేరాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి: హోటల్ యాజమాన్యం
అంకుశ్ దత్తా వేర్వేరు తేదీల్లో రూ.10 లక్షలు, రూ.7 లక్షలు, రూ.20 లక్షల విలువ చేసే మూడు చెక్కులను చెల్లించినట్లు హోటల్ యాజమాన్యం గమనించింది.
అయితే అవి బౌన్స్ అయ్యాయి. ప్రకాష్ ఈ విషయాన్ని హోటల్ యాజమాన్యం దృష్టికి తీసుకురాలేదని యాజమాన్యం తన ఫిర్యాదులో పేర్కొంది. హోటల్ లావాదేవాలకు సంబంధించిన సాఫ్ట్‌వేర్‌కు కూడా హ్యాక్ చేసి, అక్రమాలకు పాల్పడినట్లు యాజమాన్యం వెల్లడించింది.
ఈ క్రమంలో క్రిమినల్ నేరాలు, మోసం, ఫోర్జరీ వంటి నేరాలకు పాల్పడినందున వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని హోటల్ యాజమాన్యం డిమాండ్ చేసింది.
ఐజీఐ పోలీసుల ప్రాథమిక విచారణలో ఈ నేరాలు బయటపడ్డాయని తేలింది.