Manipur violence: మణిపూర్‌లో వెలుగుచూస్తున్న దారుణాలు; స్వాతంత్య్ర సమరయోధుడి భార్య సజీవ దహనం
జాతి ఘర్షణలతో మండిపోతున్న ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. గిరిజన మహిళలను నగ్నంగా ఊరేగించిన దృశ్యాలు సోషల్ మీడియాలో కనిపించిన కొద్ది రోజుల తర్వాత మరో అమానుష ఘటన బయటకు వచ్చింది. కక్చింగ్ జిల్లాలోని సెరౌ గ్రామంలో, 80 ఏళ్ల స్వాతంత్య్ర సమరయోధుడి భార్య ఇబెటోంబిని సాయుధ బృందం సజీవ దహనం చేసింది. వృద్ధురాలి ఇంటికి తాళం వేసి ఆ సాయుధ బృందం నిప్పంటించింది. దీనిపై సెరో పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఆ వృద్ధురాలి భర్త 80 ఏళ్ల వయసులో మరణించారు. ఆయన పేరు చురచంద్ సింగ్. ఆయన మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం చేతుల మీదుగా సత్కారం పొందారు.
వృద్ధురాలి మనువడికి బుల్లెట్ గాయాలు
మణిపూర్‌లో జాతి ఘర్షణలు మే 3న ప్రారంభం కాగా, ఈ వృద్ధురాలి సజీవ దహనం మే 28తెల్లవారుజామున జరిగింది. జాతి ఘర్షణల్లో దెబ్బతిన్న గ్రామాల్లో సెరౌ గ్రామం ఒకటి. సాయుధం బృందం ఇబెటోంబి ఇంటికి నిప్పు పెట్టిన తర్వాత ఆమె కుటుంబం ఆమెను రక్షించడానికి తీవ్రంగా ప్రయత్నించారు. ' ఇంటిపై సాయుధ గుంపు దాడి చేసినప్పుడు అమ్మమ్మ మమ్మల్ని పరిగెత్తమని చెప్పింది. కొంత సమయం తర్వాత ఆమె కోసం తిరిగి రావాలని చెప్పింది. ఈ క్రమంలో సాయుధ గుంపు జరిపిన కాల్పుల్లో నాకు బుల్లెట్లు తగిలాయి. ఆ తర్వాత మా అమ్మమ్మను రక్షించే ప్రయత్నం చేశాం. కానీ ప్రయోజనం లేకుండా పోయింది' ఇబెటోంబి మనవడు ప్రేమకాంత తెలిపారు.