Andhra Pradesh: మంచం పట్టిన మన్యం.. విషజ్వరాలు, మలేరియాతో గిరిజన గ్రామాల్లో విలవిల
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్‌లోని మన్యం ప్రాంతంలో విషజ్వరాలు, మలేరియా తీవ్రంగా విజృంభిస్తున్నాయి. గత నెల రోజులుగా గిరిజన గ్రామాల్లో జ్వరాల బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. చాలా గ్రామాల్లో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు, ముగ్గురు సభ్యులు ఒకేసారి అనారోగ్యానికి గురై మంచాన పడుతున్నారు. అయితే అనేక మారుమూల గూడేల్లో ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు, వైద్య బృందాలు ఇప్పటికీ చేరుకోకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల మూడు రోజుల పాటు అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, పోలవరం జిల్లాల్లోని 23 మారుమూల గిరిజన గ్రామాలను పరిశీలించగా, చిన్నారుల నుంచి వృద్ధుల వరకు జ్వరాలతో బాధపడుతూ వైద్యసేవల కోసం ఎదురుచూస్తున్న దృశ్యాలు కనిపించాయి.
వివరాలు
గ్రామాల్లో పెరుగుతున్న జ్వరాల బెడద
ఈ పరిస్థితుల్లో వైద్యశాఖ మంత్రి, ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి, కమిషనర్ స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తే తప్ప పరిస్థితి అదుపులోకి వచ్చే అవకాశాలు కనిపించడం లేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అల్లూరి జిల్లా వనభరంగిపాడు గ్రామంలో ఉన్న 78 ఇళ్లలో ఇప్పటికే 18 మంది జ్వరాలతో బాధపడుతున్నారు. గ్రామస్థుల మాటల్లో ఇప్పటివరకు వైద్య సిబ్బంది ఎవరూ గ్రామానికి రాలేదు.
పెదబూరుగులు గ్రామంలో ఎనిమిది మంది జ్వర బాధితులు తమకు పూర్తిస్థాయి మందులు ఇవ్వలేదని వాపోయారు.
ముంచంగిపుట్టు మండలం వర్కుగుమ్మిలో 45 పీవీటీజీ కుటుంబాలు ఉండగా, 23 మంది తీవ్ర జ్వరాలతో ఇళ్లకే పరిమితమయ్యారు.
వివరాలు
తన
ముంచంగిపుట్టు కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాములు గిరిజన గూడెంలో 72 కుటుంబాల్లో 24 మంది జ్వరాలతో బాధపడుతున్నారు.
వైద్యసేవలు అందకపోవడంతో వీరిలో చాలామంది ఇప్పటికీ నాటు వైద్యం, పసరు మందులనే ఆశ్రయిస్తున్నారు.
జి.మాడుగుల మండలం అంబలమామిడి గ్రామంలో 23 మంది జ్వరాలతో మంచం పట్టినా, రహదారి సౌకర్యం ఉన్నప్పటికీ వైద్య శిబిరం ఏర్పాటు చేయలేదు.
వివరాలు
పోలవరం జిల్లాలోనూ ఇదే పరిస్థితి
పోలవరం జిల్లా కొమరవరం గ్రామానికి చెందిన వృద్ధుడు వీకా వెంకన్నదొర వారం రోజులుగా తీవ్ర జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడుతున్నారు.
ఆకలి లేక గంజి, రొట్టెలతోనే కాలం గడుపుతున్నట్లు తెలిపారు.
అదే గ్రామంలోని నులకలగండి ఆవాసానికి చెందిన నాలుగేళ్ల చిన్నారి జయశ్రీ అనారోగ్యానికి గురికావడంతో, ఆమె తల్లి శివనాగలక్ష్మి బిడ్డను ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు రానుపోనూ 16 కిలోమీటర్లు నడవాల్సి వచ్చిందని వాపోయింది.
తమ గ్రామానికి వైద్య సిబ్బంది ఎవరూ రాలేదని ఆమె తెలిపింది.
వివరాలు
జొంగరపాడులో 200 మందికి జ్వరం
పార్వతీపురం మన్యం జిల్లా జొంగరపాడులో పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. గ్రామంలోని 240 మంది జనాభాలో గత నెలన్నరలో సుమారు 200 మందికి జ్వరం సోకింది.
పలువురికి మళ్లీ మళ్లీ జ్వరం వస్తోందని గ్రామస్థులు చెబుతున్నారు. మలేరియా నివారణకు అవసరమైన ఏసీటీ కిట్లు వెయ్యి డోసులు కావాలని కోరినా కేవలం 100 డోసులే వచ్చాయని వైద్య సిబ్బంది చెబుతున్నారు.
గ్రామానికి 15 కిట్లు మాత్రమే అందడంతో, చాలామంది రూ.300 నుంచి రూ.400 ఖర్చు చేసి బయట కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు.
వివరాలు
వైద్యసేవలు అందని గూడేలు
అడ్డతీగల మండలం పనుకురాతిపాలెంలో పారిశుద్ధ్యం అధ్వాన్నంగా ఉంది. ఒకే ఇంట్లో ఇద్దరు, ముగ్గురు జ్వరాలతో మంచాన పడుతున్నారు.
గ్రామానికి వెళ్లాలంటే ఏరు దాటాల్సి వస్తోంది. నెలన్నరగా అక్కడికి ఏఎన్‌ఎంలు గానీ, వైద్యులు గానీ వెళ్లలేదని గ్రామస్థులు చెబుతున్నారు.
మారేడుమిల్లి మండలం బోదులూరు పీహెచ్‌సీ పరిధిలో గతేడాది 93 మలేరియా కేసులు నమోదుకాగా, ఈ ఏడాది ఇప్పటికే 44 కేసులు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యాయి.
రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో పిల్లల వార్డులో 20పడకలు మాత్రమే ఉండగా, ప్రస్తుతం 45 మంది చిన్నారులు చికిత్స పొందుతున్నారు.
కురుపాం, గుమ్మలక్ష్మీపురం ఆసుపత్రుల్లో ఒకే పడకపై ఇద్దరు, ముగ్గురు రోగులకు చికిత్స అందిస్తున్నారు.
గుమ్మలక్ష్మీపురంలో ప్రసూతి వార్డు లేకపోవడంతో బాలింతలను కూడా జ్వరపీడితుల మధ్యే ఉంచాల్సిన పరిస్థితి నెలకొంది.
వివరాలు
ఏసీటీ, ఆర్‌డీటీ కిట్ల కొర
రాష్ట్రస్థాయి అధికారులు మలేరియా నివారణకు సరిపడా ఏసీటీ కిట్లు పంపినట్లు చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది.
చింతపల్లి, జొంగరపాడు, మొండేఖల్లు ప్రాంతాల్లో ఈ కిట్లు అందుబాటులో లేవని స్థానికులు చెబుతున్నారు. మలేరియా నిర్ధారణకు అవసరమైన ఆర్‌డీటీ కిట్లు 65 లక్షలు అవసరమైతే, కేవలం 30 లక్షలే పంపిణీ చేసినట్లు తెలుస్తోంది.
పలు ఆసుపత్రుల్లో మలేరియా మందులు కూడా లేకపోవడంతో రోగులు బయట కొనుగోలు చేస్తున్నారు.
భద్రగిరి సీహెచ్‌సీలో మందులు లేక బయట కొనుగోలు చేయాల్సి వచ్చిందని ఈతమానుగూడకు చెందిన మహిళ తెలిపారు.
చింతపల్లి సీహెచ్‌సీలో కూడా జ్వర మందుల కొరత ఉందని సమాచారం.
వివరాలు
దోమతెరల పంపిణీ కూడా అరకొర
ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రతి 45 రోజులకు ఒకసారి ఇండోర్ రెసిడ్యువల్ స్ప్రేయింగ్ నిర్వహించాల్సి ఉన్నా, అది సక్రమంగా జరగడం లేదు.
దోమతెరలను జిల్లా, మండల కేంద్రాల్లో పంపిణీ చేసినప్పటికీ, అత్యధిక సమస్య ఉన్న మారుమూల గిరిజన గ్రామాలకు అందలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
పోలవరం జిల్లాకు 1.80 లక్షల దోమతెరలు అవసరమని కోరగా, కేవలం 28,597 మాత్రమే అందాయి.
రంపచోడవరం, చింతూరు ఐటీడీఏ పరిధిలోని అనేక ప్రాంతాల్లో ఫాగింగ్ యంత్రాలు ఉపయోగించకుండా నిల్వలోనే ఉన్నాయని తెలుస్తోంది.
వివరాలు
విద్యార్థులపై తీవ్ర ప్రభావం
జ్వరాలు, మలేరియా కారణంగా విద్యార్థులు కూడా తీవ్రంగా ప్రభావితమవుతున్నారు.
సీతంపేట మండలం జొనగజగ్గడిగూడకు చెందిన 14 ఏళ్ల బాలుడు మలేరియాతో మృతిచెందాడు. నౌగడకు చెందిన 17 ఏళ్ల విద్యార్థి పచ్చకామెర్లు, టైఫాయిడ్ లక్షణాలతో మరణించాడు.
అల్లూరి జిల్లా చిలకలగెడ్డలో జూన్ నెలలో ఓ విద్యార్థి మలేరియాతో ప్రాణాలు కోల్పోయాడు.
అదే పాఠశాలలో మరో ఆరుగురికి, శివలింగపురం పాఠశాలలో ఐదుగురికి, పలకజీడి ఎస్టీ హాస్టల్‌లో ఒక విద్యార్థికి మలేరియా పాజిటివ్‌గా తేలింది.
మన్యం ప్రాంతంలో జ్వరాలు, మలేరియా వేగంగా వ్యాపిస్తుండటంతో అత్యవసర వైద్య శిబిరాలు, మందుల సరఫరా, ఏసీటీ కిట్లు, దోమతెరలు, ఫాగింగ్ వంటి నివారణ చర్యలను వెంటనే ముమ్మరం చేయాలని స్థానికులు, ప్రజాప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.