Maoists: ఫిబ్రవరి 15వరకు గడువు ఇవ్వండి: మావోయిస్టుల లేఖ!
ఈ వార్తాకథనం ఏంటి
ఆయుధాలను వదిలేసే విషయంలో మావోయిస్టులు కీలకంగా స్పందించారు. ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో భద్రతా దళాలు కూంబింగ్ ఆపరేషన్లు నిలిపివేస్తే, ఆయుధాల త్యాగానికి సంబంధించిన తేదీని అధికారికంగా ప్రకటిస్తామని చెప్పారు. ఈ విషయంపై మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. దీనికిగాను ఎంఎంసీ (మహారాష్ట్ర-మధ్యప్రదేశ్-ఛత్తీస్‌గఢ్) ప్రత్యేక జోనల్ కమిటీ ప్రతినిధి అనంత్ పేరిట ఓ బహిరంగ లేఖ విడుదలైంది.
వివరాలు
తుపాకులను వదిలేయాలని భావిస్తున్న ఎంఎంసీ స్పెషల్ జోనల్ కమిటీ
''దేశంలో, అంతర్జాతీయ స్థాయిలో మారుతున్న పరిస్థితులను పరిశీలించిన తర్వాత, మా పార్టీ కేంద్ర కమిటీ, పొలిట్ బ్యూరో సభ్యుడు కామ్రేడ్ సోను దాదా, సాయుధ పోరాటాన్ని తాత్కాలికంగా విరమించి, ఆయుధాలను త్యజించాలని తీసుకున్న నిర్ణయాన్ని మేము పూర్తిగా సమర్థిస్తున్నాం. కేంద్ర కమిటీ సభ్యులు సతీశ్ దాదా, చంద్రన్న కూడా ఇదే నిర్ణయానికి మద్దతు తెలిపారు. ఎంఎంసీ స్పెషల్ జోనల్ కమిటీ సైతం తుపాకులను వదిలేయాలని భావిస్తోంది. అయితే, ఈ నిర్ణయాన్ని సమగ్రంగా అమలు చేసేందుకు ఫిబ్రవరి 15వరకు సమయం ఇవ్వాలని మూడు రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నాం.
వివరాలు
పీఎల్‌జీఏ వారోత్సవాన్ని నిర్వహించబోం
ప్రజాస్వామ్య కేంద్రీకరణ విధానాలను అనుసరించే మా పార్టీ నిర్మాణంలో, అందరి అభిప్రాయాలను సమీకరించడానికి కొంత సమయం తప్పనిసరి. మా సహచరులను సంప్రదించి, నిర్ణయాన్ని అధికారిక రీతిలో వారికి చేరవేయడానికి ఈ విరామం అవసరం. దీనికి వేరే ఉద్దేశమేమీ లేదు. త్వరగా సమాచారాన్ని చేరవేయడానికి మాకు ప్రత్యక్ష మార్గాలు లేకపోవడంతోనే ఈ వ్యవధిని కోరుతున్నాం. భద్రతా దళాలు తమ ఆపరేషన్లను నిలిపితే, మేమూ పీఎల్‌జీఏ వారోత్సవాన్ని నిర్వహించము. మా అన్ని కార్యక్రమాలను పూర్తిగా ఆపేస్తామని హామీ ఇస్తున్నాం'' అని లేఖలో పేర్కొన్నారు.