Amaravati: వర్మీ కంపోస్ట్‌కు మార్క్‌ఫెడ్ అండ.. రైతులకు నాణ్యమైన సేంద్రియ ఎరువు
ఈ వార్తాకథనం ఏంటి
గ్రామ పంచాయతీల పరిధిలోని ఘన వ్యర్థాల నిర్వహణ యూనిట్లలో ఉత్పత్తి చేస్తున్న వర్మీ కంపోస్ట్‌ను మార్క్‌ఫెడ్ ద్వారా మార్కెటింగ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని తొలుత తూర్పుగోదావరి జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేసి, అనంతరం దశలవారీగా రాష్ట్రవ్యాప్తంగా విస్తరించనున్నారు. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ, ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల సమన్వయంతో కార్యక్రమాన్ని అమలు చేయాలని వ్యవసాయశాఖ ఎక్స్‌అఫీషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
వివరాలు
అమలు విధానం ఇలా...
రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఘన వ్యర్థాల నిర్వహణ యూనిట్లలో వర్మీ కంపోస్ట్ ఉత్పత్తి కొనసాగుతుంది.
ఉత్పత్తి చేసిన వర్మీ కంపోస్ట్ నమూనాలను మండల వ్యవసాయ అధికారులు సేకరించి నాణ్యతను ధ్రువీకరిస్తారు.
నాణ్యత నిర్ధారణ అనంతరం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల (PACS) ద్వారా రైతులతో పాటు ఇతర అర్హత కలిగిన సంస్థలకు విక్రయాలు నిర్వహిస్తారు.
ఈ మొత్తం ప్రక్రియలో మార్క్‌ఫెడ్ కీలక పాత్ర పోషిస్తుంది. వర్మీ కంపోస్ట్ సేకరణతో పాటు క్యూఆర్ కోడ్‌తో కూడిన బ్రాండెడ్ సంచుల్లో ప్యాకింగ్ చేసి మార్కెట్లోకి తీసుకువస్తుంది.
బ్రాండింగ్, మార్కెటింగ్, విక్రయాలు, చెల్లింపుల నిర్వహణ బాధ్యతలను కూడా మార్క్‌ఫెడ్ చేపడుతుంది.
వివరాలు
డిజిటల్ విధానం అమలు
అలాగే 'సీమైడ్' సాఫ్ట్‌వేర్ ద్వారా నిల్వలు, కొనుగోలు ఆర్డర్లు, బిల్లులు, చెల్లింపుల ట్రాకింగ్, పర్యవేక్షణ వంటి అన్ని ప్రక్రియలను డిజిటల్ విధానంలో నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమం ద్వారా గ్రామస్థాయిలో ఉత్పత్తి అయ్యే సేంద్రియ ఎరువులకు మార్కెట్ కల్పించడంతో పాటు, రైతులకు నాణ్యమైన వర్మీ కంపోస్ట్ అందుబాటులోకి రావడం, గ్రామ పంచాయతీలకు అదనపు ఆదాయం సమకూరడం లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది.