Jammu Kashmir: నౌగామ్ పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు.. 9 మంది మృతి
ఈ వార్తాకథనం ఏంటి
జమ్ముకశ్మీర్‌లోని నౌగామ్ పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం రాత్రి జరిగిన భారీ పేలుడు తీవ్ర విషాదానికి దారితీసింది. రాత్రి 11.22 గంటల సమయంలో సంభవించిన ఈ విస్ఫోటంలో 9 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 25 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. మృతుల్లో పోలీసులు, ఫోరెన్సిక్ విభాగ సిబ్బంది ఉన్నారని స్పష్టం చేశారు. పేలుడు సంభవించిన వెంటనే భారీ మంటలు చెలరేగి, దట్టమైన పొగ ప్రాంతమంతా వ్యాపించింది. ధాటికి భవనం శిథిలాలమయమై, పలువురు ఆ శిథిలాల కింద చిక్కుకున్నారు. వెంటనే రెస్క్యూ బృందాలు సహాయక చర్యలను ప్రారంభించాయి. స్థానికుల ప్రకారం, పేలుడు తీవ్రత ఎంత ఎక్కువగా ఉందో, శరీర అవశేషాలు దాదాపు 300 మీటర్ల దూరంలో కూడా కనిపించినట్లు తెలిపారు.
Details
శ్రీనగర్ పోలీస్ కంట్రోల్ రూమ్ కు మృతదేహాల తరలింపు
అదేవిధంగా స్టేషన్ ప్రాంగణంలో నిలిపి ఉంచిన అనేక వాహనాలు మంటల్లో కాలిపోయాయి. ఇటీవల హరియాణా-జమ్ముకశ్మీర్ పోలీసులు సంయుక్తంగా ఫరీదాబాద్‌లో నిర్వహించిన సోదాల్లో 360 కిలోల పేలుడు పదార్థాలు, పలు ఆయుధాలు స్వాధీనం చేసిన విషయం తెలిసిందే. ఈ పేలుడు పదార్థాలను నౌగామ్ పోలీస్ స్టేషన్‌కు తరలించి, వాటినుంచి నమూనాలు సేకరిస్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగినట్లు అధికారులు వివరించారు. పేలుడు జరిగిన ప్రదేశం నుంచి మృతదేహాలను బయటకు తీసి శ్రీనగర్‌లోని పోలీస్ కంట్రోల్ రూమ్‌కు తరలించారు.
Details
పోలీస్ స్టేషన్ భవనం పూర్తిగా ధ్వంసం
అయితే మృతి చెందినవారి గుర్తింపు ఇంకా జరగలేదని అధికారులు పేర్కొన్నారు. భారీ విస్ఫోటనం తరువాత కూడా స్టేషన్ పరిసరాల్లో పలు చిన్న చిన్న పేలుళ్లు కొనసాగడం వల్ల రెస్క్యూ కార్యకలాపాలకు ఆటంకం ఏర్పడింది. పోలీస్ స్టేషన్ భవనం దాదాపు పూర్తిగా ధ్వంసమైందని సమాచారం. ఘటనకు గల ఖచ్చితమైన కారణాలను నిర్ధారించేందుకు దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ఘటనపై జమ్మూ-కశ్మీర్ పోలీసులు అధికారిక ప్రకటన విడుదల చేయాల్సి ఉంది.