LOADING...
Fire accident: లక్నోలోని కోచింగ్ సెంటర్‌లో భారీ అగ్నిప్రమాదం.. 11 మంది మృతి
లక్నోలోని కోచింగ్ సెంటర్‌లో భారీ అగ్నిప్రమాదం.. నలుగురు మృతి

Fire accident: లక్నోలోని కోచింగ్ సెంటర్‌లో భారీ అగ్నిప్రమాదం.. 11 మంది మృతి

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 22, 2026
05:20 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఘోర విషాదం చోటుచేసుకుంది. అలీగంజ్ ప్రాంతంలోని పురానియా ప్రాంతంలో ఉన్న ఓ భవనంలో భారీ అగ్నిప్రమాదం సంభవించగా, ఈ ఘటనలో దాదాపు 11 మంది సజీవదహనం అయినట్లు సమాచారం. మంటల నుంచి తప్పించుకునేందుకు పలువురు ప్రాణాల కోసం పరుగులు పెట్టినా ఫలితం లేకపోయింది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం, ఒక్కసారిగా భవనం నుంచి భారీగా మంటలు ఎగిసిపడటంతో అక్కడ తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. కొందరు ప్రాణాలు కాపాడుకోవడానికి భవనం పై అంతస్తుల నుంచి కిందకు దూకినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొద్ది క్షణాల్లోనే భవనం మొత్తం దట్టమైన పొగ, మంటలతో నిండిపోయినట్లు సమాచారం.

వివరాలు

కోచింగ్ సెంటర్‌గా ప్రచారం.. కానీ వాస్తవం వేరే!

ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మంటలను అదుపులోకి తీసుకురావడంతో పాటు, భవనంలో చిక్కుకున్న కొందరిని సురక్షితంగా బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. ప్రాథమికంగా ఈ భవనంలో కోచింగ్ సెంటర్, లైబ్రరీ నిర్వహిస్తున్నట్లు వార్తలు వెలువడ్డాయి. అయితే అనంతరం సీనియర్ పోలీసు అధికారులు దీనిపై స్పష్టత ఇచ్చారు. ప్రస్తుతం ఆ భవనంలో కోచింగ్ సెంటర్ గానీ, లైబ్రరీ గానీ కార్యకలాపాలు నిర్వహించడం లేదని తెలిపారు. అధికారుల వివరాల ప్రకారం, భవనం కింది అంతస్తులో పెంపుడు జంతువుల దుకాణం (పెట్ షాప్) ఉండగా, పై అంతస్తులో ఉద్యోగులు గేమింగ్ సాఫ్ట్‌వేర్‌కు సంబంధించిన పనులు నిర్వహించే గేమింగ్ జోన్ కార్యకలాపాలు సాగుతున్నట్లు వెల్లడించారు.

వివరాలు

సీఎం యోగి స్పందన

ఈ అగ్నిప్రమాదంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వెంటనే స్పందించారు. ఘటనాస్థలికి అధికారులు తక్షణమే చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించాలని ఆదేశించారు. అలాగే రెస్క్యూ ఆపరేషన్‌ను వేగవంతం చేయాలని, గాయపడిన వారికి అత్యుత్తమ వైద్యసేవలు అందించాలని సూచించారు. "రక్షణ చర్యలు వేగంగా కొనసాగాలి. గాయపడిన వారికి తక్షణ చికిత్స అందించాలి. అధికారులు అప్రమత్తంగా ఉండి పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు.

Advertisement

వివరాలు

కారణాలపై దర్యాప్తు

మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకున్న అనంతరం అగ్నిమాపక శాఖ, పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర దర్యాప్తు చేపట్టనున్నారు. అగ్నిప్రమాదం ఎలా సంభవించింది, భద్రతా లోపాలు ఏమైనా ఉన్నాయా, ఆస్తి నష్టం ఎంత మేరకు జరిగింది అనే అంశాలపై అధికారులు విచారణ జరుపుతున్నారు. ప్రస్తుతం ఉన్నతాధికారులు సంఘటన స్థలంలోనే మకాం వేసి పరిస్థితిని పర్యవేక్షిస్తూ సహాయక చర్యలను సమన్వయం చేస్తున్నారు. ఈ ఘటనతో లక్నో నగరంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.

Advertisement