Hyderabad: హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 18వ అంతస్తు వరకు వ్యాపించిన అగ్నికీలలు
ఈ వార్తాకథనం ఏంటి
హైదరాబాద్‌లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో గురువారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అక్కడి పసిఫికా హిల్‌క్రెస్ట్ అపార్ట్‌మెంట్‌లోని బి-బ్లాక్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. తొలుత 12వ అంతస్తులో ప్రారంభమైన మంటలు క్రమంగా పై అంతస్తులకు వ్యాపించి 18వ అంతస్తు వరకు చేరాయి. దీంతో అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న వారంతా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనతో పరిసర ప్రాంతాల్లో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నార్సింగి ఎస్‌హెచ్‌వో విష్ణువర్ధన్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం ఉదయం 11.50 గంటల సమయంలో అపార్ట్‌మెంట్‌లోని 12వ అంతస్తు నుంచి పొగలు రావడాన్ని అక్కడి నివాసితులు గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన వారు ప్రాణాలు కాపాడుకునేందుకు భవనం నుంచి బయటకు పరుగులు తీశారు. కొద్దిసేపటికే మంటలు తీవ్రరూపం దాల్చి పై అంతస్తులకు వ్యాపించాయి.
వివరాలు
షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందని పోలీసుల అంచనా
సమాచారం అందుకున్న లంగర్‌హౌస్ అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించారు.
నాలుగు ఫైరింజిన్లతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు చర్యలు చేపట్టారు.
గంటల తరబడి శ్రమించి చివరకు మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ అగ్నిప్రమాదంలో అపార్ట్‌మెంట్ వెలుపల ఏర్పాటు చేసిన ఫాల్ సీలింగ్ పూర్తిగా కాలిపోయింది.
మంటల తీవ్రతకు భవనం గోడలు సైతం మసితో నల్లగా మారాయి. అయితే, ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అపార్ట్‌మెంట్ వాసులతో పాటు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్నిప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.