Indore: ఇండోర్‌లో ఘోర అగ్ని ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి
ఈ వార్తాకథనం ఏంటి
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుని ఏడు మంది ఒకే కుటుంబ సభ్యులు ప్రాణాలు కోల్పోయిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. బృజేశ్వరి అనెక్స్ ప్రాంతంలోని బెంగాలీ స్క్వేర్ సమీపంలో ఉన్న మూడు అంతస్తుల నివాస భవనంలో బుధవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం సంభవించింది. మృతుల్లో 12 ఏళ్ల బాలిక కూడా ఉండటం విషాదాన్ని మరింత పెంచింది. పోలీసుల వివరాల ప్రకారం, ఉదయం సుమారు 3 గంటల సమయంలో ఇంటి బయట పార్క్ చేసి చార్జింగ్‌కు పెట్టిన ఎలక్ట్రిక్ వాహనంలో పేలుడు సంభవించడంతో అగ్ని ప్రమాదం ప్రారంభమైంది. చార్జింగ్ పాయింట్ వద్ద జరిగిన ఈ పేలుడు కారణంగా మంటలు వేగంగా వ్యాపించాయి.
Details
కొన్ని పేలిపోవడంతో పరిస్థితి మరింత విషమం
ఇంట్లో సుమారు 10 ఎల్పీజీ సిలిండర్లు నిల్వ ఉండగా, వాటిలో కొన్ని పేలిపోవడంతో పరిస్థితి మరింత విషమించింది. అగ్ని ప్రమాదం సమయంలో వరుసగా రెండు నుంచి మూడు పేలుళ్లు జరిగినట్లు అధికారులు తెలిపారు. భవనంలోని మూడు అంతస్తుల్లో నివాసం ఉండగా, ఎలక్ట్రానిక్ లాకింగ్ వ్యవస్థ కారణంగా బయటకు రావడం కష్టమైందని తెలుస్తోంది. ప్రమాద సమయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో తలుపులు తెరుచుకోక, లోపల ఉన్నవారు చిక్కుకుపోయినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది, అత్యవసర బృందాలు ఘటనాస్థలానికి చేరుకుని రక్షణ చర్యలు చేపట్టాయి. పక్కనున్న భవనం ద్వారా లోపలికి ప్రవేశించి కొంతమందిని బయటకు తీసుకొచ్చారు. ముగ్గురిని సురక్షితంగా రక్షించారు.
Details
గాయపడ్డ వారికి ఆస్పత్రిలో చికిత్స
అపస్మారక స్థితిలో ఉన్న ఆరుగురిని ఆసుపత్రికి తరలించగా అక్కడ వైద్యులు వారు మృతి చెందినట్లు నిర్ధారించారు. ఎక్కువ మంది పొగ పీల్చడం వల్లే ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడైంది. ఈ ప్రమాదంలో భవనం మధ్య అంతస్తు పూర్తిగా దెబ్బతినగా, మిగతా భాగాలు కూడా తీవ్రంగా నష్టపోయాయి. ఈ ఇల్లు పాలిమర్ వ్యాపారి మనోజ్ పుగాలియాకు చెందినదిగా గుర్తించారు. ఎల్పీజీతో పాటు ఇతర మండే పదార్థాలు కూడా ఇంట్లో నిల్వ ఉండే అవకాశముందని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతులను విజయ్ సేథియా(65), చిన్నూ సేథియా(22), సుమన్(60), మనోజ్ పుగాలియా (65), సిమ్రన్ (30), రాశి సేథియా(12), టిను (35)గా గుర్తించారు. గాయపడిన సౌరభ్ పుగాలియా (30), ఆశిష్ (30), హర్షిత్ పుగాలియా(25) ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.