Loading...
Srisailam: శ్రీశైలానికి భారీ వరద.. నిండుకుండలా మారుతున్న జలాశయం
శ్రీశైలానికి భారీ వరద.. నిండుకుండలా మారుతున్న జలాశయం

Srisailam: శ్రీశైలానికి భారీ వరద.. నిండుకుండలా మారుతున్న జలాశయం

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 08, 2026
10:00 am

ఈ వార్తాకథనం ఏంటి

కృష్ణా నది ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో శ్రీశైలం జలాశయం నిండుకుండను తలపిస్తోంది. ప్రాజెక్టుకు వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతుండటంతో జలాశయంలో నీటిమట్టం వేగంగా పెరుగుతోంది. శుక్రవారం రాత్రి 9 గంటల సమయానికి జూరాల ప్రాజెక్టు నుంచి దిగువకు 2,57,059 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. అదే సమయంలో శ్రీశైలం జలాశయానికి 2,11,331 క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చి చేరింది.

వివరాలు

మరో 10 అడుగులే..

శ్రీశైలం జలాశయం గరిష్ఠ నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం నీటిమట్టం 874.70 అడుగులకు చేరుకుంది.

జలాశయం పూర్తిస్థాయిలో నిండాలంటే ఇంకా దాదాపు 10 అడుగుల మేర నీరు చేరాల్సి ఉంది. ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 215.81 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 162.81 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

రానున్న రెండు, మూడు రోజుల్లో జలాశయంలో నీటి నిల్వ 200 టీఎంసీలను దాటే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

మరో రెండు రోజుల పాటు శ్రీశైలానికి సుమారు 2 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. దీంతో జలాశయంలో నీటిమట్టం మరింత వేగంగా పెరిగే అవకాశముంది.

వివరాలు

జలవిద్యుత్‌ ఉత్పత్తి ప్రారంభం

శ్రీశైలానికి భారీగా వరద నీరు వస్తుండటంతో అధికారులు జలవిద్యుత్‌ ఉత్పత్తిని ప్రారంభించారు. తెలంగాణ పరిధిలోని ఎడమగట్టు విద్యుత్‌ కేంద్రంలో 21,189 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తూ 7.319 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేస్తున్నారు.

అదేవిధంగా ఆంధ్రప్రదేశ్‌ పరిధిలోని కుడిగట్టు విద్యుత్‌ కేంద్రంలో 9,603 క్యూసెక్కుల నీటిని వినియోగించి 1.684 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ ఉత్పత్తి జరుగుతోంది.

రెండు విద్యుత్‌ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి అనంతరం మొత్తం 30,792 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు.

ADVERTISEMENT

వివరాలు

వెలిగోడుకు 4 వేల క్యూసెక్కులు

విద్యుత్‌ ఉత్పత్తి కోసం వినియోగించిన నీటితో పాటు వెలిగోడు జలాశయానికి 4,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.

అలాగే శనివారం గోరకల్లు జలాశయానికి మరో 4,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

భారీ వరద ప్రవాహం కొనసాగుతున్న నేపథ్యంలో శ్రీశైలం జలాశయంలో నీటి నిల్వ వేగంగా పెరుగుతుండటంతో అధికారులు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

ADVERTISEMENT