Andhra Pradesh: రూ.2,508 కోట్లతో తిరుపతిలో రాయల్ ఎన్‌ఫీల్డ్.. రాష్ట్రంలో కొత్త ప్రాజెక్టులకు ఆమోదం
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్'లో పరిశ్రమల అభివృద్ధికి ఊపిరి పోసేలా భారీ పెట్టుబడులు ముందుకు వస్తున్నాయి. బుల్లెట్ బండ్లు తయారు చేసే ప్రసిద్ధ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ తిరుపతిలో రూ.2,508 కోట్ల పెట్టుబడితో మోటార్‌సైకిళ్ల తయారీ పరిశ్రమను ఏర్పాటు చేయనుంది. ఈ ప్రతిపాదనకు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఆమోదం తెలిపింది. అదే సమయంలో విశాఖపట్నంలో రిలయన్స్ సంస్థ రూ.1,08,010 కోట్లతో డేటా కేంద్రాన్ని నిర్మించేందుకు ముందుకొచ్చింది. ఇక శ్రీ సత్యసాయి జిల్లాలో అదే సంస్థ రూ.51 వేల కోట్లతో సౌర విద్యుత్ కేంద్రం,శక్తి నిల్వ వ్యవస్థను ఏర్పాటు చేయనుంది. కడప జిల్లాలో అదానీ గ్రూప్ రూ.12 వేల కోట్ల పెట్టుబడితో జలవిద్యుత్ నిల్వ ప్రాజెక్టును చేపట్టనుంది.
వివరాలు
ప్రతి ప్రతిపాదనా.. ఒప్పందంగా మారాలి
మొత్తంగా పలు సంస్థలు కలిపి రూ.2,00,964.10కోట్ల పెట్టుబడులకు ప్రతిపాదనలు సమర్పించగా వాటికి ఆమోదం లభించింది. ఈ ప్రాజెక్టుల ద్వారా 38,722మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నట్లు తెలియజేశారు. ఈసందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రాష్ట్రానికి వచ్చే ప్రతి పెట్టుబడి ప్రతిపాదన కూడా ఒప్పందంగా మారాలని, ప్రతి ఒప్పందం ఆచరణలోకి రావాలని అధికారులను ఆదేశించారు. అనుమతుల నుంచి ప్రారంభోత్సవం వరకు అన్ని ప్రక్రియలు నిర్ణీత గడువులో పూర్తి కావాలని చెప్పారు. ప్రభుత్వం నుంచి అనుమతుల్లో ఎలాంటి ఆలస్యం ఉండకూడదని స్పష్టం చేశారు. పోటీ ప్రపంచంలో పెట్టుబడులు ఆకర్షించాలంటే ప్రత్యేకత చూపాలని,రాష్ట్రంలో అనుమతులు పొందడం ఎంత సులభమో చూపించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రాజెక్టులు రాష్ట్రానికి రావాలన్న ఆసక్తి ఉన్న అధికారులను కీలక స్థానాల్లో నియమించాలని సూచించారు.
వివరాలు
చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ప్రాధాన్యం
భారీ పరిశ్రమలతో పాటు చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు కూడా సమాన ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం సూచించారు. ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త తయారవ్వాలన్న లక్ష్యానికి ఇవి కీలకమని అన్నారు. ఆహార పదార్థాల తయారీ రంగంలో ఉన్న అవకాశాలను వినియోగించుకుని పెట్టుబడులు నేలమీదకు దిగేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఉద్యాన,వాణిజ్య పంటలకు విలువ జోడింపు జరిగితే రైతులకు లాభం చేకూరుతుందని పేర్కొన్నారు. ముఖ్యంగా ఆయిల్ పామ్, మామిడి, కొబ్బరి, కోకో వంటి పంటలపై దృష్టి సారించాలని సూచించారు. ఈ సమావేశంలో మంత్రులు టీజీ భరత్, అచ్చెన్నాయుడు, సుభాష్, వర్చువల్ విధానంలో మంత్రి కేశవ్ పాల్గొన్నారు.