Kochi: కొచ్చిలోని తమనం వద్ద భారీ నీటి ట్యాంక్ కూలి నీట మునిగిన ఇళ్ళు..
ఈ వార్తాకథనం ఏంటి
కేరళ వాటర్ అథారిటీ (KWA)కు చెందిన ఒక ఫీడర్ వాటర్ ట్యాంక్ సోమవారం తెల్లవారుజామున ఆకస్మికంగా కూలిపోయింది. కేరళలోని తమ్మనం ప్రాంతంలో ఉన్న ఆ ట్యాంక్ ధ్వంసమైన వెంటనే దానిలో నిల్వ ఉన్న సుమారు 1.38 కోట్ల లీటర్ల నీరు ఒక్కసారిగా చుట్టుపక్కల ఉన్న ఇళ్లపైకి గుమ్మరించినట్లు పడిపోయింది ఈ అనూహ్య సంఘటనతో అక్కడి ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు. అకస్మాత్తుగా ఉప్పొంగిన నీటివల్ల అనేక ఇళ్లలోకి భారీగా వరదనీరు చేరింది. కొంతమంది ఇళ్ల పైకప్పులు కూలిపోగా, పలు వాహనాలు కూడా నీటిలో కొట్టుకుపోయాయి. రాత్రి 2 గంటల సమయంలో కేడబ్ల్యూఏ ఫీడర్ పంప్ హౌస్‌కు చెందిన ట్యాంక్‌లో ఒక భాగం విరిగిపోవడంతో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్టు అధికారులు తెలిపారు.
వివరాలు
50 సంవత్సరాల క్రితం నిర్మాణమైన ట్యాంక్
వరదనీరు ఇళ్లలోకి దూసుకుపోవడంతో ఎలక్ట్రానిక్ పరికరాలు, ఫర్నిచర్ వంటి గృహోపకరణాలు పెద్ద ఎత్తున నష్టపోయాయి. అంతేకాకుండా సమీపంలో ఉన్న ఒక ఆరోగ్య కేంద్రంలోకి కూడా నీరు చేరి, మందులు మరియు వైద్య పరికరాలు దెబ్బతిన్నాయన్న సమాచారం వచ్చింది. ఈ ట్యాంక్‌ను సుమారు 50 సంవత్సరాల క్రితం నిర్మించినట్టు తెలిసింది. ఇక్కడి నుంచే కొచ్చి మరియు త్రిపునితుర ప్రాంతాలకు తాగునీటి సరఫరా జరుగుతుందని ఎర్నాకుళం ఎమ్మెల్యే వినోద్ తెలిపారు. వరద ప్రభావంతో నష్టపోయిన కుటుంబాలకు నష్టపరిహారం అందించాలని ఆయన కేడబ్ల్యూఏ అధికారులను కోరారు. ప్రస్తుతం కొచ్చి మరియు పరిసర ప్రాంతాలకు నీటి సరఫరా సాగేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్టు కేడబ్ల్యూఏ అధికారులు స్పష్టం చేశారు.