Kasibugga Stampede: గాయపడిన వారు త్వరగా కోలుకోవాలి.. శ్రీకాకుళం తొక్కిసలాటపై మోదీ విచారం
ఈ వార్తాకథనం ఏంటి
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటన దేశవ్యాప్తంగా దిగ్భ్రాంతి కలిగించింది. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. 'ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలో గల వేంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటన బాధాకరం. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యుల పట్ల నా ఆలోచనలు ఉన్నాయి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని ప్రధాని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ.50,000 చొప్పున ఎక్స్‌గ్రేషియా సాయాన్ని ప్రకటించినట్లు ప్రధానమంత్రివర్యుల కార్యాలయం (PMO) వెల్లడించింది.
Details
స్పందించిన అమిత్ షా
ఇక కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఈ ఘటనపై స్పందించారు. ''కాశీబుగ్గలో జరిగిన తొక్కిసలాటలో భక్తులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని ఆయన సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ఏకాదశి సందర్భంగా శనివారం వేంకటేశ్వరస్వామి ఆలయానికి వేలాదిమంది భక్తులు తరలివచ్చారు. ఈ క్రమంలోనే రద్దీ పెరగడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. పలువురు భక్తులు స్పృహ తప్పి పడిపోవడంతో పరిస్థితి విషమించింది. ఈ ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోగా, మృతుల్లో ఎక్కువమంది మహిళలు ఉన్నట్లు సమాచారం. సుమారు 20 మంది భక్తులు గాయపడినట్లు స్థానిక వర్గాలు వెల్లడించాయి.