Loading...
Andhra Pradesh: మేయర్, ఛైర్మన్‌ను ప్రజలే ఎన్నుకునేలా చట్ట సవరణకు ప్రభుత్వం సిద్ధం
మేయర్, ఛైర్మన్‌ను ప్రజలే ఎన్నుకునేలా చట్ట సవరణకు ప్రభుత్వం సిద్ధం

Andhra Pradesh: మేయర్, ఛైర్మన్‌ను ప్రజలే ఎన్నుకునేలా చట్ట సవరణకు ప్రభుత్వం సిద్ధం

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 17, 2026
08:55 am

ఈ వార్తాకథనం ఏంటి

మేయర్,మున్సిపల్‌ ఛైర్మన్‌ స్థానాలకు ఇకపై ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందుకు సంబంధించిన మున్సిపల్‌ చట్ట సవరణ ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తీసుకుని, మంగళవారం శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టనుంది. త్వరలో జరగనున్న పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లోనే ఈ ప్రత్యక్ష ఎన్నికల విధానాన్ని అమలు చేసేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. 2005కు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో మేయర్లు, మున్సిపల్‌ ఛైర్మన్లను ప్రజలే నేరుగా ఎన్నుకునేవారు. అయితే 2005లో అప్పటి ప్రభుత్వం చట్ట సవరణ తీసుకొచ్చి పరోక్ష ఎన్నికల విధానాన్ని అమల్లోకి తెచ్చింది. అప్పటి నుంచి ఎన్నికైన కార్పొరేటర్లు తమలో ఒకరిని మేయర్‌గా ఎన్నుకుంటుండగా.. మున్సిపాలిటీలు,నగర పంచాయతీల్లో కౌన్సిలర్లు తమలో ఒకరిని ఛైర్మన్‌గా ఎంపిక చేస్తున్నారు.

వివరాలు 

ఈ విధానం రాష్ట్రాలకు ప్రయోజనకరం

పరోక్ష ఎన్నికల విధానంపై నీతి ఆయోగ్‌ కూడా ఇటీవల అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఈ విధానం లోపభూయిష్టంగా ఉందని రాష్ట్రాలకు నివేదించింది.

పలు రాష్ట్రాల్లో మేయర్లు, మున్సిపల్‌ ఛైర్మన్లపై వారి సహచర సభ్యులే ఏడాది లేదా రెండేళ్లకోసారి అవిశ్వాస తీర్మానం పెట్టి పదవి నుంచి తొలగిస్తున్నారని పేర్కొంది.

దీనివల్ల పట్టణ స్థానిక సంస్థల పాలనపై తీవ్ర ప్రభావం పడుతోందని ఆందోళన వ్యక్తం చేసింది.

మేయర్లు, ఛైర్మన్లను ప్రజలు నేరుగా ఎన్నుకునే విధానం రాష్ట్రాలకు ప్రయోజనకరంగా ఉంటుందని సూచించింది.

నీతి ఆయోగ్‌ సూచనలకు ముందే ప్రత్యక్ష ఎన్నికల విధానంపై సానుకూలంగా ఉన్న కూటమి ప్రభుత్వం.. రానున్న పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో మేయర్, మున్సిపల్‌ ఛైర్మన్‌ స్థానాలకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది.

వివరాలు 

శాసనసభలో బిల్లు

ఈ అంశంపై సీఎం చంద్రబాబు నాయుడు ఇటీవల ఎమ్మెల్యేల అభిప్రాయాలను కూడా సేకరించారు.

ప్రత్యక్ష ఎన్నికల విధానాన్ని అమలు చేయాలంటే మున్సిపల్‌ చట్టాల్లో సవరణలు చేయాల్సి ఉండటంతో.. మంగళవారం ఉదయం జరిగే మంత్రివర్గ సమావేశంలో సంబంధిత ప్రతిపాదనలకు ఆమోదం తీసుకోనున్నారు.

అనంతరం అదే రోజు శాసనసభలో బిల్లును ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.

దీంతో ప్రభుత్వం అక్టోబర్‌లో నిర్వహించాలని భావిస్తున్న 123 పుర, నగర పాలిక సంస్థలు, నగర పంచాయతీల ఎన్నికల్లో మేయర్, మున్సిపల్‌ ఛైర్మన్‌ స్థానాలకు ప్రత్యక్ష ఎన్నికలు జరగనున్నాయి.

అంటే ఈసారి మేయర్, ఛైర్మన్‌లను కార్పొరేటర్లు, కౌన్సిలర్లు కాకుండా నేరుగా ప్రజలే ఎన్నుకోనున్నారు.

ADVERTISEMENT