
Gang Rape: బెంగాల్‌లో వైద్య విద్యార్థినిపై అత్యాచారం.. ముగ్గురు అరెస్టు
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమ బెంగాల్‌లో ఒడిశాకు చెందిన ఓ వైద్య విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచార ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నప్పటికీ వారి వివరాలు ఇప్పటివరకు వెల్లడించబడలేదు. బాలేశ్వర్ జిల్లాకు చెందిన 23 ఏళ్ళ యువతి దుర్గాపుర్‌లోని శోభాపుర్ సమీపంలో ఉన్న ఓ ప్రైవేట్ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. శుక్రవారం రాత్రి, ఆమె తన స్నేహితుడితో కలిసి బయటకు వెళ్లింది. పలువురు దుండగులు వీరిని వెంబడించి, బాధితురాలిని బెదిరించి సమీప అడవిలోకి ఎత్తుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయం బయటకు వస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆమెను బెదిరించారు.
Details
తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయకూడదు
తీవ్ర రక్తస్రావంతో స్పృహ తప్పిన బాధితురాలిని స్థానికులు గమనించి, సమీప ఆసుపత్రిలో చేర్పించి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న బాధితురాలి తల్లిదండ్రులు శనివారం ఉదయం దుర్గాపుర్ చేరారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఫిర్యాదులో బాధితురాలి స్నేహితుడు కూడా నేరంలో పాల్గొన్నట్లు తెలిపారు. అతను ఆమెను తప్పుదారిపట్టించి, నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి ఫోన్, డబ్బును లాక్కొన్నట్లు పేర్కొన్నారు. పోలీసులు బాధితురాలి స్నేహితుడితో పాటు చాలా మందిని విచారిస్తున్నారని తెలిపారు. ఆమె వాంగ్మూలాన్ని కూడా నమోదు చేసినట్లు పేర్కొన్నారు. నిందితులు కఠిన శిక్ష పొందేలా చర్యలు తీసుకుంటామని పోలీసులు ఎక్స్‌లో తెలిపారు. అలాగే ఈ ఘటనకు సంబంధించి తప్పుడు సమాచారం వ్యాప్తి చేయవద్దని ప్రజలను కోరారు.