ASEAN Summit: ట్రంప్‌తో భేటీ రద్దు.. ఆసియాన్ సమ్మిట్‌లో వర్చువల్ ఎంట్రీకి సిద్ధమైన మోదీ
ఈ వార్తాకథనం ఏంటి
మలేసియా రాజధాని కౌలాలంపూర్‌లో అక్టోబర్ 26 నుంచి 28 వరకు జరగనున్న ఆసియాన్ సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈసారి ప్రత్యక్షంగా హాజరుకాకుండా, వర్చువల్‌గా పాల్గొననున్నారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ఎక్స్ వేదికగా ప్రకటించారు. ప్రతేడాది జరిగే ఈ సదస్సుకు మోదీ హాజరయ్యేరు కానీ, ఈసారి మాత్రం వ్యక్తిగతంగా హాజరు కావడం లేదని తెలిపారు. అంతేకాక, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో జరగాల్సిన భేటీ కూడా రద్దయిందని సమాచారం. ట్రంప్ కూడా ఈ సదస్సులో పాల్గొననున్నట్లు ప్రకటించిన కొద్ది గంటలకే మోదీ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ప్రధానమంత్రి మోదీ ఈరోజు జరిగే 22వ ఆసియాన్-ఇండియా సమ్మిట్‌లో ఆన్‌లైన్ ద్వారా పాల్గొననున్నారు.
Details
భారత-ఆసియాన్ సంబంధాలపై సమీక్షా
ఆసియాన్ నాయకులతో కలిసి భారత-ఆసియాన్ సంబంధాల పురోగతిని సమీక్షించి, సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలపర్చే మార్గాలపై చర్చించనున్నారు. ఈ విషయాన్ని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటనలో వెల్లడించింది. ఆసియాన్‌తో ఉన్న అనుబంధం భారతదేశం 'యాక్ట్ ఈస్ట్ పాలసీ', ఇండో-పసిఫిక్ విజన్‌కు కీలక స్తంభమని ఆ ప్రకటనలో పేర్కొంది. ఇక మోదీ ఈ నిర్ణయం తీసుకోవడంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో జరగవలసిన ద్వైపాక్షిక భేటీపై గత కొన్ని రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు ముగింపు లభించింది. తొలుత ప్రధాని మోదీ కౌలాలంపూర్‌తో పాటు కంబోడియా పర్యటన కూడా ప్లాన్ చేసినట్లు సమాచారం.
Details
ఆసియాన్ సమ్మిట్‌కి ఎస్.జైశంకర్ ప్రాతినిధ్యం
అయితే, ఆసియాన్ సదస్సుకు హాజరు కాకపోవడంతో కంబోడియా పర్యటన కూడా వాయిదా పడింది. ఈసారి భారతదేశ తరఫున విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఆసియాన్ సమ్మిట్‌లో ప్రాతినిధ్యం వహించనున్నారు. ఈ మార్పును కూడా మోదీ స్వయంగా ప్రకటించారు. మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో ఫోన్‌లో స్నేహపూర్వకంగా మాట్లాడిన అనంతరం, మలేసియాకు ఆసియాన్ ఛైర్మన్‌షిప్ లభించినందుకు ఆయన అభినందనలు తెలిపారు. 'ఆసియాన్-ఇండియా సమ్మిట్‌లో వర్చువల్‌గా పాల్గొనడానికి ఎదురు చూస్తున్నాను. భారత-ఆసియాన్ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలనే ఆశతో ఉన్నానని మోదీ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.