
Mega DSC: నేడు మెగా డీఎస్సీ ఉత్సవ్.. ఎంపీలు,ఎమ్మెల్యేలంతా రావాలి.. శాసనసభలో మంత్రి నారా లోకేశ్
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్‌లో మెగా డీఎస్సీ ద్వారా ఎంపికైన 15,941 మంది అభ్యర్థులకు గురువారం అమరావతిలో నియామక ఉత్తర్వులు అందజేయనున్నట్లు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి చేసిన తొలి సంతకం మెగా డీఎస్సీ పైనే జరగడం,ప్రభుత్వానికి ఇదే తొలి విజయమని ఆయన స్పష్టం చేశారు. బుధవారం శాసనసభలో మాట్లాడుతూ లోకేశ్, "ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ఈ నియామకోత్సవం జరుగుతోంది.ఉద్యోగం పొందిన అభ్యర్థులతోపాటు వారి కుటుంబ సభ్యులు కూడా వస్తారు.మొత్తంగా 32 వేల మంది పాల్గొననున్నారు. ప్రతి జిల్లాకు ఒక జోన్ ఏర్పాటు చేస్తున్నాం.ఎమ్మెల్యేలు,ఎంపీలు తప్పనిసరిగా హాజరై,తమ ప్రాంత ఉపాధ్యాయులతో అనుసంధానమయ్యే మంచి అవకాశమిది" అని అన్నారు.
వివరాలు
పులివెందుల ఎమ్మెల్యేకు కూడా అధికారిక ఆహ్వానం
అలాగే, గతంలో ఎప్పుడైనా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చినపుడు రకరకాల ఆటంకాలు ఎదురయ్యాయని, వైకాపా నేతలు 106 కేసులు వేశారనీ, కానీ ఈసారి నోటిఫికేషన్ పకడ్బందీగా ఇచ్చి, ఒక్క స్టే కూడా రాకుండా పారదర్శకంగా పూర్తి చేశామని వివరించారు. కార్యక్రమానికి వైకాపా ఎమ్మెల్యేలతో పాటు పులివెందుల ఎమ్మెల్యేకు కూడా అధికారిక ఆహ్వానం పంపినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఉపసభాపతి రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ, మెగా డీఎస్సీని ప్రతిపక్షం కూడా అభినందించే రీతిలో ప్రభుత్వం నిర్వహించిందని, అందుకే ఇది విశేషంగా నిలిచిందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా కేవలం 150 రోజుల్లో మెగా డీఎస్సీని పూర్తిచేసింది.
వివరాలు
రికార్డు సమయంలో మెగా డీఎస్సీ పూర్తి
ఈ పరీక్షలను పూర్తిగా ఆన్‌లైన్ విధానంలో నిర్వహించింది.అన్ని స్థాయిల్లో హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేసి ఫిర్యాదులను పరిష్కరించడం జరిగింది. ఎస్సీ వర్గీకరణ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత తొలిసారి డీఎస్సీ ద్వారానే రిజర్వేషన్లు అమలయ్యాయి. అదేవిధంగా,క్రీడా కోటా (3%) ప్రవేశపెట్టి,ఎలాంటి పరీక్ష రాయాల్సిన అవసరం లేకుండా,క్రీడా సర్టిఫికెట్ల ఆధారంగా 372 మంది క్రీడాకారులు ఉపాధ్యాయ ఉద్యోగాలు పొందారు. 1994 నుంచి 2025 వరకూ, ఉమ్మడి రాష్ట్రం నుండి ఇప్పటి వరకు పరిశీలిస్తే, 14 డీఎస్సీలను ప్రకటించి 1,96,619 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసిన నాయకుడిగా సీఎం చంద్రబాబు నిలిచారు. తాజా మెగా డీఎస్సీలో మొత్తం 16,347 పోస్టులకు ప్రకటన ఇచ్చినా,కొన్ని రిజర్వేషన్ కేటగిరీల్లో అభ్యర్థులు దొరకకపోవడంతో 15,941 పోస్టులకే అభ్యర్థులు ఎంపిక అయ్యారు.
వివరాలు
కర్నూలులో అత్యధికం.
మిగిలిపోయిన 406 పోస్టులు,రాబోయే కొత్త ఖాళీలను వచ్చే ఏడాది కొత్త డీఎస్సీలో భర్తీ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. మెగా డీఎస్సీ ఫలితాల్లో ఉమ్మడి కర్నూలు జిల్లాలోనే అత్యధికంగా 2,590 పోస్టులు భర్తీ అయ్యాయి. ఎంపికైన 15,941 మంది అభ్యర్థుల్లో 7,955 మంది మహిళలు ఉండడం విశేషం. దాదాపు సగం ఉపాధ్యాయ ఉద్యోగాలను మహిళలు సాధించారు. అదనంగా, రాష్ట్రస్థాయి సబ్జెక్టుల వారీగా టాపర్లుగా నిలిచిన 16 మంది,అలాగే ఇన్‌స్పైర్ అవార్డు విజేతలైన 6 మందితో కలిపి మొత్తం 22 మందికి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ స్వయంగా నియామక పత్రాలు అందజేస్తారు. మిగిలిన వారికి ప్రాంగణంలోనే అధికారులు ఉత్తర్వులు అందజేస్తారు.