LOADING...
Andhra News: అమరావతి, గన్నవరంలో 8,10 ప్లాట్‌ఫామ్స్‌తో మెగా రైల్‌ టెర్మినళ్లు
అమరావతి, గన్నవరంలో 8,10 ప్లాట్‌ఫామ్స్‌తో మెగా రైల్‌ టెర్మినళ్లు

Andhra News: అమరావతి, గన్నవరంలో 8,10 ప్లాట్‌ఫామ్స్‌తో మెగా రైల్‌ టెర్మినళ్లు

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 31, 2025
08:56 am

ఈ వార్తాకథనం ఏంటి

రైల్వే శాఖ ఏపీ రాజధాని ప్రాంతం అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని అమరావతి,గన్నవరంలలో మెగా కోచింగ్‌ టెర్మినల్స్‌ నిర్మించేందుకు సమగ్ర ప్రణాళికను సిద్ధం చేసింది. భవిష్యత్‌లో అమరావతి మీదుగా రైళ్ల రాకపోకలు భారీ స్థాయిలో పెరగనున్న నేపథ్యంలో, అక్కడ 8 ప్లాట్‌ఫాంలతో కూడిన ఆధునిక టెర్మినల్‌ నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నాయి. ఇందులో రైళ్ల నిర్వహణ పనులకూ తగిన సదుపాయాలు కల్పించనున్నారు. అదే విధంగా, విజయవాడ రైల్వే స్టేషన్‌పై పెరుగుతున్న ఒత్తిడిని తగ్గించడానికి గన్నవరం టెర్మినల్‌ను కూడా విస్తృతంగా అభివృద్ధి చేయనున్నారు. ఈ రెండు ప్రాజెక్టులతో పాటు విజయవాడ ప్రధాన స్టేషన్‌, గుంటూరు స్టేషన్‌లను కూడా మరిన్ని రైళ్ల రాకపోకలకు అనుకూలంగా విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందించారు.

వివరాలు 

అమరావతి మెగా టెర్మినల్‌ వివరాలు 

రైల్వే శాఖ ఎర్రుపాలెం నుండి నంబూరు వరకు సుమారు 56 కిలోమీటర్ల పొడవున కొత్త రైల్వే లైన్‌ నిర్మిస్తోంది. ఇందులో అమరావతిని ప్రధాన స్టేషన్‌గా,మెగా కోచింగ్‌ టెర్మినల్‌గా తీర్చిదిద్దనున్నారు. ఈ టెర్మినల్‌ ద్వారా రోజుకు 120 రైళ్ల రాకపోకలు జరిగేలా ఏర్పాట్లు ఉంటాయి. ఒక స్టేషన్‌ నుండి ప్రయాణికుల కోచ్‌లతో రైళ్లు బయలుదేరడం, గమ్యస్థానంగా అదే స్టేషన్‌ నిలవడం జరిగితే, దాన్ని "కోచింగ్‌ టెర్మినల్‌"గా పిలుస్తారు. ఆ విధంగా అమరావతిలో రైళ్ల నిర్వహణ, శుభ్రపరిచే పనులు చేయడానికి ప్రత్యేక సదుపాయాలు ఏర్పాటు చేయనున్నారు. ఈ టెర్మినల్‌లో మొత్తం 8 రైల్వే లైన్లు, 8 ప్లాట్‌ఫాంలు ఉంటాయి. ఒక్కో ప్లాట్‌ఫామ్‌పై 24 ఎల్‌హెచ్‌బీ కోచ్‌లతో కూడిన రైలు నిలిచేలా నిర్మిస్తారు.

వివరాలు 

గన్నవరం మెగా టెర్మినల్‌ 

అదనంగా రైళ్ల సాంకేతిక నిర్వహణ కోసం ఆరు పిట్‌ లైన్లు ఏర్పాటుచేస్తారు. వీటిలో ఒకటి ప్రత్యేకంగా వందేభారత్‌ రైళ్ల కోసం కేటాయిస్తారు. ఈ టెర్మినల్‌ నిర్మాణానికి అవసరమైన భూమి సుమారు 300 ఎకరాలు అని రైల్వే శాఖ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. విజయవాడకు ప్రత్యామ్నాయంగా గన్నవరం రైల్వే స్టేషన్‌ను మెగా కోచింగ్‌ టెర్మినల్‌గా మార్చే పనులు కూడా ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం గన్నవరంలో మూడు ప్లాట్‌ఫాంలే ఉండగా, కొద్ది రైళ్లు మాత్రమే ఆగుతాయి. రాబోయే కాలంలో దీన్ని పెద్ద స్థాయిలో అభివృద్ధి చేసి, విజయవాడ స్టేషన్‌పై ఉన్న ఒత్తిడి తగ్గించేలా చేయనున్నారు. సికింద్రాబాద్‌ స్టేషన్‌పై ఒత్తిడిని తగ్గించేందుకు చర్లపల్లిలో టెర్మినల్‌ నిర్మించిన తరహాలోనే, గన్నవరంలో కూడా మెగా టెర్మినల్‌ను నిర్మించనున్నారు.

వివరాలు 

విజయవాడ స్టేషన్‌ విస్తరణ 

ఇక్కడ మొత్తం 10 రైల్వే లైన్లు, 10 ప్లాట్‌ఫాంలు ఏర్పాటు చేయనున్నారు. ఈ టెర్మినల్‌ ద్వారా రోజుకు సుమారు 205 రైళ్లు రాకపోకలు సాగించేలా ప్రణాళిక ఉంది. రైళ్ల నిర్వహణ కోసం 4 పిట్‌ లైన్లు కూడా ఏర్పాటు చేస్తారు. గన్నవరం టెర్మినల్‌ నిర్మాణానికి సుమారు 143 ఎకరాలు భూమి కేటాయించాలని రైల్వే శాఖ రాష్ట్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించింది. ప్రస్తుతం విజయవాడ రైల్వే స్టేషన్‌ మీదుగా రోజుకు దాదాపు 200 రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. రాబోయే సంవత్సరాల్లో ఈ సామర్థ్యాన్ని 300 రైళ్ల వరకు పెంచేలా అభివృద్ధి చేయాలని రైల్వే అధికారులు నిర్ణయించారు.

వివరాలు 

లైన్లను పొడిగించేందుకు ప్రణాళికలు

ప్రస్తుతం 1, 2, 3 లైన్లు చిన్నవిగా ఉండటం వల్ల 28 ఎల్‌హెచ్‌బీ లేదా 24 ఐసీఎఫ్‌ కోచ్‌లతో కూడిన రైళ్లను ఆ ప్లాట్‌ఫాంలపై నిలపడం కష్టంగా ఉంది. అందుకే ఈ లైన్లను పొడిగించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. అదేవిధంగా, స్టేషన్‌కు సమీపంలో ఉన్న రిసెప్షన్‌ సిగ్నల్‌ వద్ద నుంచి రైళ్లు ప్రస్తుతం గంటకు 15 కి.మీ. వేగంతో మాత్రమే స్టేషన్‌లోకి ప్రవేశిస్తున్నాయి. అభివృద్ధి పనులు పూర్తయ్యాక రైళ్లు గంటకు 40-50 కి.మీ. వేగంతో స్టేషన్‌లోకి ప్రవేశించి ప్లాట్‌ఫాంల వద్ద ఆగేలా సదుపాయం కల్పించనున్నారు.

వివరాలు 

గుంటూరు స్టేషన్‌లో కొత్త ప్లాట్‌ఫామ్‌ 

గుంటూరు రైల్వే స్టేషన్‌లో ప్రస్తుతం ఏడు ప్లాట్‌ఫాంలు ఉన్నాయి. రాబోయే నెలల్లో మరో కొత్త ప్లాట్‌ఫామ్‌ నిర్మించి మొత్తం సంఖ్యను ఎనిమిదికి పెంచనున్నారు. ప్రస్తుత సామర్థ్యం 120 రైళ్ల రాకపోకలకు సరిపోతుండగా, విస్తరణ పనుల తర్వాత దాన్ని 170 రైళ్ల సామర్థ్యానికి పెంచనున్నారు.