LOADING...
Mega Steel Plant: ఏపీలో భారీ స్టీల్ ప్లాంట్ ప్రారంభం.. లక్ష మందికి ఉద్యోగావకాశాలు
ఏపీలో భారీ స్టీల్ ప్లాంట్ ప్రారంభం.. లక్ష మందికి ఉద్యోగావకాశాలు

Mega Steel Plant: ఏపీలో భారీ స్టీల్ ప్లాంట్ ప్రారంభం.. లక్ష మందికి ఉద్యోగావకాశాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 23, 2026
04:36 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికాభివృద్ధి దిశగా మరో కీలక అడుగు పడింది. ప్రపంచంలో అగ్రగామి స్టీల్ సంస్థలు అయిన ఆర్సెలార్ మిత్తల్‌, నిప్పాన్ స్టీల్ ఇండియా (ఏఎంఎన్‌ఎస్‌) సంయుక్తంగా ఏర్పాటు చేస్తున్న భారీ ఉక్కు కర్మాగారానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రులతో కలిసి భూమి పూజ నిర్వహించారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేటలో ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం 5,465 ఎకరాల విస్తీర్ణంలో, సంవత్సరానికి 17.8 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి సామర్థ్యంతో రెండు దశల్లో ఈ కర్మాగారం నిర్మించనున్నారు. ఈ కార్యక్రమానికి ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌తో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు, సంస్థ ప్రతినిధులు హాజరయ్యారు.

వివరాలు 

భారీ పెట్టుబడితో రూపుదిద్దుకుంటున్న స్టీల్ ప్లాంట్

ఈ స్టీల్ ప్రాజెక్ట్ మొత్తం పెట్టుబడి రూ.1,35,964 కోట్లుగా నిర్ణయించారు. ఇందులో భాగంగా మొదటి దశలోనే 2,600 ఎకరాల్లో రూ.80 వేల కోట్ల వ్యయంతో నిర్మాణ పనులు చేపట్టనున్నారు. 2029 నాటికి ఉత్పత్తి ప్రారంభించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే సుమారు లక్ష మందికి ప్రత్యక్ష, పరోక్షంగా ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

వివరాలు 

గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్.. పోర్టుతో అదనపు అవకాశాలు

ఆర్సెలార్ మిత్తల్ గ్రీన్ ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్‌ను రెండు దశల్లో అభివృద్ధి చేయనున్నారు. ఈ ఫ్యాక్టరీకి అనుబంధంగా రూ.11,198 కోట్ల వ్యయంతో ప్రత్యేక క్యాప్టివ్ పోర్టును కూడా నిర్మించనున్నారు. ఈ పోర్టు ద్వారా అదనంగా మరో 6 వేల ఉద్యోగాలు లభిస్తాయి. ఏఎంఎన్‌ఎస్‌ ఇండియా ప్రవేశంతో విశాఖపట్నం పరిసర ప్రాంతం పరిశ్రమల కేంద్రంగా అభివృద్ధి చెందనుంది. ఈ ప్రాజెక్ట్ వేగంగా పూర్తయ్యేలా రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా మద్దతు అందిస్తోంది. అలాగే స్టీల్ ప్లాంట్‌ను నేషనల్ హైవే-16కు అనుసంధానం చేయడానికి 4 లేన్ల రహదారి విస్తరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి.

Advertisement

ట్విట్టర్ పోస్ట్ చేయండి

అనకాపల్లిలో రూ.1.35 లక్షల కోట్ల స్టీల్ ప్రాజెక్ట్‌కు భూమిపూజ

Advertisement