LOADING...
Meghalaya honeymoon murder: రాజా రఘువంశీ అంత్యక్రియల్లో పాల్గొన్న సోనమ్ ప్రియుడు 
రాజా రఘువంశీ అంత్యక్రియల్లో పాల్గొన్న సోనమ్ ప్రియుడు

Meghalaya honeymoon murder: రాజా రఘువంశీ అంత్యక్రియల్లో పాల్గొన్న సోనమ్ ప్రియుడు 

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 10, 2025
11:09 am

ఈ వార్తాకథనం ఏంటి

మేఘాలయలో హనీమూన్‌కు వెళ్లిన కొత్త వధూవరుల అదృశ్య ఘటన ఊహించని మలుపు తిరిగింది. ఈ కేసులో భార్యే భర్తను పథకం ప్రకారం హత్య చేయించిందన్న విషయం ఇటీవల వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు ఈ కేసులో మరో కీలక అంశం బయటపడింది. భర్తను హత్య చేసిన కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరైన రాజ్ కుశ్యాహా, మరణించిన రఘువంశీ అంత్యక్రియల్లో కూడా పాల్గొన్నట్టు తాజా సమాచారం వెల్లడైంది. ఈ విషయాన్ని రఘువంశీ కుటుంబసభ్యులు స్వయంగా వెల్లడించారు. ఇప్పటికే రఘువంశీ హత్య కేసులో అతడి భార్య సోనమ్‌తో పాటు మరో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.

వివరాలు 

 రఘువంశీ అంత్యక్రియల్లో కుశ్యాహా 

వారిలో రాజ్ కుశ్యాహా అనే నిందితుడు, సోనమ్‌తో అత్యంత సన్నిహిత సంబంధం కలిగి ఉన్నాడన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే క్రమంలో, రఘువంశీ అంత్యక్రియల్లో కుశ్యాహా పాల్గొన్న వీడియోను మృతుడి సోదరి సోషల్ మీడియా వేదికగా 'ఎక్స్'లో పోస్టు చేశారు. రఘువంశీ మృతదేహం వెలికి తీసిన తర్వాత దాన్ని ఇందౌర్‌కు తరలించేందుకు కుటుంబ సభ్యులు నాలుగు వాహనాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. అందులో ఒక వాహనాన్ని నిందితుడే నడిపాడని వారు వెల్లడించారు.అంతేకాదు,సోనమ్ తండ్రిని ఓదార్చే పనిలో కూడా అతడు పాల్గొన్నాడని చెప్పారు. అరెస్టు జరిగిన తరువాతే అతడు నిందితుడన్న విషయం తమకు తెలిసిందని చెప్పారు.

వివరాలు 

నలుగురు నిందితుల అరెస్ట్

హత్యలో తన పాత్రను ఎవ్వరూ గుర్తించకుండా ఉండేందుకే కుశ్యాహా, రఘువంశీ కుటుంబానికి అత్యంత విధేయుడిలా, నమ్మకంగా వ్యవహరించినట్టు అనుమానం వ్యక్తమవుతోంది. ఇందౌర్‌కు చెందిన సోనమ్,రఘువంశీ దంపతులు మే 20న మేఘాలయకు హనీమూన్‌కి వెళ్లిన తర్వాత కనిపించకుండా పోయారు. ఆపై జూన్ 2న రఘువంశీ మృతదేహాన్ని పోలీసులు లోయలో గుర్తించారు. అప్పటివరకు కనిపించని సోనమ్ కోసం విస్తృతంగా గాలింపు చేపట్టగా,ఆమె ఉత్తరప్రదేశ్‌లోని గాజీపుర్ జిల్లాలో పోలీసుల ఎదుట లొంగిపోయింది. అనంతరం నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు, సోనమ్ భర్తను హత్య చేయించినట్టు వారు వెల్లడించారు. అయితే, ఈ హత్యలో తనకు ఎలాంటి పాత్ర లేదని, తాను హత్య చేయించలేదని సోనమ్ పోలీసులకు తెలిపింది. తనను ఎవరో అపహరించారని కూడా ఆమె పేర్కొనడం గమనార్హం.