LOADING...
Meghnad Desai: మేఘనాథ్ దేశాయ్ కన్నుమూత.. ప్రధాని సంతాపం.. ఇంతకీ ఆయన ఎవరంటే?
మేఘనాథ్ దేశాయ్ కన్నుమూత.. ప్రధాని సంతాపం.. ఇంతకీ ఆయన ఎవరంటే?

Meghnad Desai: మేఘనాథ్ దేశాయ్ కన్నుమూత.. ప్రధాని సంతాపం.. ఇంతకీ ఆయన ఎవరంటే?

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 30, 2025
10:05 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ ఆర్థిక శాస్త్రవేత్త, రచయిత లార్డ్ మేఘనాథ్ దేశాయ్ (84) అనారోగ్యంతో బ్రిటన్‌లో కన్నుమూశారు. భారతదేశంలో జన్మించి, బ్రిటన్‌లో స్థిరపడ్డ దేశాయ్ మరణవార్త ప్రపంచ విద్యావేత్తలు, రాజకీయ వర్గాల్లో తీవ్ర విషాదాన్ని కలిగించింది. యూకే హౌస్ ఆఫ్ లార్డ్స్ సభ్యుడిగా పదవీ నిర్వహించిన ఆయన, ఆర్థిక విద్య, సాహిత్యం, పాలిటికల్ ఎకానమీ వంటి రంగాల్లో తనదైన ముద్ర వేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశాయ్ మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి సానుభూతి తెలుపుతూ, మేఘనాథ్ దేశాయ్‌ను గొప్ప మేధావిగా, విద్యారంగానికి అంకితమైన వ్యక్తిగా కొనియాడారు. భారత ప్రభుత్వం 2009లో ఆయనను పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది.

Details

యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్‌లో పీహెచ్‌డీ

1940లో గుజరాత్‌లోని వడోదరలో జన్మించిన మేఘనాథ్ దేశాయ్, 1963లో పెన్సిల్వేనియా యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్‌లో పీహెచ్‌డీ పూర్తిచేశారు. ఆ తర్వాత 1965లో లండన్‌కు వెళ్లి, దాదాపు నాలుగు దశాబ్దాలపాటు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్(LSE)లో ప్రొఫెసర్‌గా పనిచేశారు. అనేక తరం విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా నిలిచిన ఆయనను LSE 'మేధో దిగ్గజం'గా కొనియాడింది. 1991లో ఆయన లేబర్ పార్టీ తరపున హౌస్ ఆఫ్ లార్డ్స్‌లో లేబర్ పీర్‌గా నియమితులయ్యారు. మార్క్సిజం, కాపిటలిజం,భారతీయ రాజకీయాలపై ఆయన రాసిన రచనలు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. మేఘనాథ్ దేశాయ్ రచించిన 'Marks's Revenge: The Resurgence of Capitalism and the Death of Statist Socialism', 'The Rediscovery of India' వంటి పుస్తకాలు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధికెక్కినవే.

Details

ప్రముఖుల సంతాపం

2022లో విడుదలైన ఆయన చివరి రచన 'The Political Economy of Poverty' అభ్యాసాల్లో ప్రముఖంగా చర్చకు వచ్చింది. సినిమా రంగంపైనా ఆసక్తి చూపిన ఆయన, బాలీవుడ్‌ లెజెండ్ దిలీప్ కుమార్ జీవితం ఆధారంగా కూడా పుస్తకం రచించారు. జీవితం మొత్తాన్ని లండన్‌లో గడిపినా భారతదేశంతో ఆయన బలమైన మానసిక సంబంధం కొనసాగించారు. తరచూ భారత ఆర్థిక వ్యవస్థ, రాజకీయాలపై అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ చర్చల్లో పాల్గొనేవారు. లార్డ్ మేఘనాథ్ దేశాయ్ మృతిపై ప్రపంచవ్యాప్తంగా రాజకీయ నాయకులు, విద్యావేత్తలు, గౌరవ సంస్థల ప్రతినిధులు తీవ్ర సంతాపం ప్రకటించారు. ఆయన సేవలు, ఆలోచనలు, రచనలు తరం తరానికి మార్గదర్శకంగా నిలుస్తాయని వారు కొనియాడారు.