LOADING...
Guntur: తురకపాలెంలో మెలియాయిడోసిస్‌ ఆందోళన.. జంతువులకు పరీక్షలు అవసరం.. వైద్య నిపుణుల సూచన 
వైద్య నిపుణుల సూచన

Guntur: తురకపాలెంలో మెలియాయిడోసిస్‌ ఆందోళన.. జంతువులకు పరీక్షలు అవసరం.. వైద్య నిపుణుల సూచన 

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 22, 2025
08:58 am

ఈ వార్తాకథనం ఏంటి

గుంటూరు జిల్లా తురకపాలెం ప్రాంతంలో ఇటీవల చోటుచేసుకున్న రహస్యమైన మరణాల నేపథ్యంలో స్థానిక ప్రజలపై నిర్వహించిన వైద్య పరీక్షల్లో కొంతమందికి 'మెలియాయిడోసిస్‌' పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఈ వ్యాధి గురించి.. ఇది ఎలా వ్యాపిస్తుంది? అంటువ్యాధేనా? దాని లక్షణాలు, ప్రమాదాలు ఏమిటి? అనే ప్రశ్నలపై చర్చ మొదలైంది. జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రం (NCDC),భారత ప్రభుత్వ ఆరోగ్య సేవల డైరెక్టరేట్‌ జనరల్‌ వివరాల ప్రకారం,మెలియాయిడోసిస్‌ అనేది గ్రామ్‌ నెగెటివ్‌ బాక్టీరియా 'బర్ఖోల్డేరియా సూడోమెల్లై' వల్ల కలిగే అంటువ్యాధి. ఈ వ్యాధి ఒక మనిషి నుంచి మరొకరికి నేరుగా సోకదు.జంతువుల నుంచి మనుషులకు వ్యాప్తి చాలా అరుదుగా మాత్రమే జరుగుతుంది. కలుషిత మట్టి, నీటిలో ఈ బాక్టీరియా అనేక సంవత్సరాల పాటు జీవించగలదు.

వివరాలు 

ఎప్పుడు ఎక్కువగా వ్యాపిస్తుంది?

వర్షాకాలంలో వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. తుపాన్లు, వరదల సమయంలో దీని వ్యాప్తి మరింత పెరుగుతుంది. ఊపిరితిత్తుల సమస్యల నుండి ప్రాణాంతకమైన సెప్టిసీమియా వరకూ ప్రభావం చూపగలదు. దీనికి టీకా (వాక్సిన్‌) అందుబాటులో లేదు. వ్యాప్తి ప్రాంతాలు ఆగ్నేయాసియా, ఉత్తర ఆస్ట్రేలియాలో ఈ వ్యాధి ఎక్కువగా ఉన్నట్టు పరిశోధనలు చెబుతున్నాయి. భారత్‌లో తొలిసారి 1991లో ముంబయిలో ఒక కేసు నమోదైంది. వ్యాప్తికి అవకాశాలు ఇవీ.. అదేవిధంగా పశువులు,గేదెలు,గుర్రాలు,గాడిదలు,జింకలు,ఒంటెలు,కుక్కలు,పిల్లులు,పక్షులు, సరీసృపాలు,డాల్ఫిన్లలో కూడా గుర్తించబడింది. ఇలాంటి జంతువులు చెరువులు లేదా మట్టిలో తిరిగితే, వాటి స్రావాలు లేదా పుండ్ల నుంచి వచ్చే రసాలు, రక్తం కలుషితమవుతాయి.

వివరాలు 

జాగ్రత్తలు 

ఆ మట్టి లేదా నీటిని మనిషి తాకడం లేదా శుద్ధి చేయని నీటిని తాగడం వల్ల వ్యాధి సోకుతుంది. ముఖ్యంగా శరీరంలో గాయాలు ఉన్నప్పుడు బ్యాక్టీరియా లోపలికి సులభంగా ప్రవేశిస్తుంది. కలుషితమైన నీటిని తాగకూడదు. చర్మంపై గాయాలుంటే మట్టికి, చెరువు నీటికి దూరంగా ఉండాలి. వర్షాకాలం, తుపాన్ల సమయంలో మరింత జాగ్రత్త అవసరం. స్థానిక పశువుల్లో వ్యాధి లక్షణాలు కనిపిస్తే ర్యాండమ్‌ పరీక్షలు చేసి నిర్ధారించుకోవాలి.

వివరాలు 

ఎక్కువగా ప్రభావితమయ్యే వర్గాలు 

మధుమేహం ఉన్నవారు దీర్ఘకాలిక మూత్రపిండాల సమస్యలు ఉన్నవారు అధిక మద్యపానం చేసే వారు కాలేయ వ్యాధులు ఉన్నవారు తలసీమియా బాధితులు సిస్టిక్‌ ఫైబ్రోసిస్‌, సీఓపీడీ, బ్రాంకియక్టాసిస్‌ వంటి ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడుతున్నవారు క్యాన్సర్‌ లేదా రోగనిరోధక శక్తిని ప్రభావితం చేసే వ్యాధులున్నవారు 40 ఏళ్లకు పైబడినవారు

వివరాలు 

లక్షణాలు/ తీవ్రత 

సాధారణంగా పల్మనరీ ఇన్‌ఫెక్షన్‌ రూపంలో కనిపిస్తుంది. ఇది బ్రాంకైటిస్‌లా తేలికగా ఉండొచ్చు లేదా న్యుమోనియా లా తీవ్రతతో కూడినదిగా ఉండొచ్చు. ప్రధాన లక్షణాలు: దగ్గు (కఫం/శ్వాసకోశ స్రావాలతో కూడినది) శ్వాసలో ఇబ్బంది, ఛాతీ నొప్పి అధిక జ్వరం తలనొప్పి బరువు తగ్గిపోవడం రక్తంతో కలిసిన కఫం (హెమోప్టిసిస్‌) మూత్ర సంబంధిత సమస్యలు జంతువులలో ఈ వ్యాధి కనుగొంటే దానిని హెచ్చరిక సంకేతంగా పరిగణించాలి.

వివరాలు 

నిపుణుల అభిప్రాయం 

ఎన్టీఆర్‌ పశువైద్య కళాశాల, గన్నవరం పశువైద్య సూక్ష్మజీవశాస్త్ర విభాగం ప్రొఫెసర్‌ డాక్టర్‌ పి. ఆనంద్‌కుమార్‌ మాట్లాడుతూ.. "భారతదేశంలో ఇప్పటివరకు జంతువుల్లో మెలియాయిడోసిస్‌ పైన పెద్దగా పరిశోధనలు లేవు. అయితే ఉపఖండంలోని పొరుగు దేశాల్లో మేకలు, గొర్రెలు, పందులు, పాడి పశువుల్లో ఈ వ్యాధి కారక బాక్టీరియాను గుర్తించారు. కాబట్టి వర్షాల అనంతరం పర్యావరణ నమూనాలతో పాటు అనుమానాస్పద జంతువులపై పరీక్షలు జరపాలి. జంతువుల్లో ఈ వ్యాధిని గుర్తించగలిగితే, అది ముందస్తు హెచ్చరిక వ్యవస్థగా ఉపయోగపడుతుంది. తద్వారా సరైన చర్యలు తీసుకుని, మానవులలో మెలియాయిడోసిస్‌ వ్యాప్తిని అడ్డుకోవచ్చు" అని చెప్పారు.