Messi Kolkata Event Row: 'నన్ను బలి పశువును చేశారు'.. మెస్సీ ఈవెంట్‌లో గందరగోళం.. మాజీ మంత్రిపై ఫిర్యాదు
ఈ వార్తాకథనం ఏంటి
అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ కోల్‌కతా పర్యటన సందర్భంగా గత ఏడాది జరిగిన గందరగోళం మరోసారి వార్తల్లోకి వచ్చింది. ఈ కార్యక్రమ నిర్వాహకుడు సతద్రు దత్తా తాజాగా మాజీ పశ్చిమ బెంగాల్ క్రీడాశాఖ మంత్రి అరూప్ బిశ్వాస్, మాజీ డీజీపీ ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న రాజీవ్ కుమార్, ఐఏఎస్ అధికారి శంతను బసుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోల్‌కతాలోని సాల్ట్‌లేక్ స్టేడియంలో భద్రతా నిబంధనలు పూర్తిగా కూలిపోయాయని, అనధికారిక వ్యక్తులు వీఐపీ జోన్లలోకి ప్రవేశించడంతో మెస్సీ భద్రతకు ముప్పు ఏర్పడిందని ఆయన ఆరోపించారు. ఈ ఈవెంట్‌కు అవసరమైన అన్ని అనుమతులు, పోలీస్ క్లియరెన్సులు తీసుకున్నామని సతద్రు దత్తా తెలిపారు.
వివరాలు
భద్రతా వ్యవస్థలో జరిగిన ఈ లోపాల వల్లే స్టేడియంలో ఉద్రిక్త పరిస్థితులు
అయితే యాక్సెస్ కార్డుల జారీ విషయంలో అరూప్ బిశ్వాస్ తనపై ఒత్తిడి తీసుకువచ్చారని చెప్పారు. "నేను యాక్సెస్ కార్డులు ఇవ్వడానికి నిరాకరించినా, కొందరు స్టేడియంలోకి ఎలా వచ్చారో తెలీదు? నన్నే బలి పశువుగా చేశారు. రూ.50 కోట్ల నష్టపరిహారం కోరుతూ కేసు వేస్తాను. పరువు నష్టం దావా కూడా వేస్తాను" అని ఆయన మీడియాతో పేర్కొన్నారు. కార్యక్రమానికి ముందే అనధికారిక ప్రవేశాలపై పోలీస్ ఉన్నతాధికారులతో సమావేశాల్లో తాను ఆందోళన వ్యక్తం చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. భద్రతా వ్యవస్థలో జరిగిన ఈ లోపాల వల్లే స్టేడియంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని, తర్వాత అభిమానుల ఆగ్రహానికి కారణమైందని తెలిపారు. ఘటనపై దర్యాప్తులో అరూప్ బిశ్వాస్ పేరును ప్రస్తావించవద్దని తనను బెదిరించారని కూడా ఆరోపించారు.
వివరాలు
ఇతర నగరాల నుంచి కూడా అభిమానులు
గత ఏడాది డిసెంబర్‌లో మెస్సీని ఒక్కసారి చూడాలని వేలాది మంది అభిమానులు సాల్ట్‌లేక్ స్టేడియానికి తరలివచ్చారు. కొందరు అభిమానులు రూ.14 వేల వరకు టికెట్లు కొనుగోలు చేసి ఇతర నగరాల నుంచి కూడా వచ్చారు. అయితే గ్రౌండ్‌లో వీఐపీలు,రాజకీయ నాయకుల రద్దీ కారణంగా అభిమానులకు మెస్సీని సరిగా చూడే అవకాశం దక్కలేదు. దీంతో ఆగ్రహించిన అభిమానులు బాటిళ్లు విసిరి,గేట్లు ధ్వంసం చేయడానికి ప్రయత్నించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో మెస్సీ కొద్ది నిమిషాల్లోనే స్టేడియాన్ని వీడి వెళ్లిపోయారు. మెస్సీ వెళ్లిపోయిన తర్వాత అభిమానులు మైదానంలోకి దూసుకెళ్లి టెంట్లు, గోల్‌పోస్టులను ధ్వంసం చేశారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు స్వల్ప బలప్రయోగం చేయాల్సి వచ్చింది.ఈ ఘటన అనంతరం నిర్వాహకుడు సతద్రు దత్తాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వివరాలు
బాధ్యులపై చర్యలు తీసుకుంటాం: నిశిత్ ప్రమాణిక్
ఇక తాజాగా పశ్చిమ బెంగాల్‌లో కొత్తగా బాధ్యతలు చేపట్టిన బీజేపీ ప్రభుత్వ క్రీడాశాఖ మంత్రి నిశిత్ ప్రమాణిక్ ఈ కేసును మళ్లీ తెరపైకి తీసుకొచ్చారు. "మెస్సీ ఈవెంట్‌లో మోసపోయిన అభిమానులకు న్యాయం చేయడమే మా లక్ష్యం. ఈ ఘటనకు సంబంధించిన ఫైల్‌ను తిరిగి తెరవాలని నిర్ణయం తీసుకున్నాం. బాధ్యులపై చర్యలు తీసుకుంటాం" అని తెలిపారు. అలాగే మెస్సీ గోట్ టూర్ నిర్వాహకులు అభిమానులకు టికెట్ డబ్బులు తిరిగి చెల్లించాలని ఆదేశాలు ఇచ్చినట్లు మంత్రి వెల్లడించారు.