LOADING...
Rain Alert : ఏపీ ప్రజలకు అలెర్ట్.. పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు.. హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ కేంద్రం
హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ కేంద్రం

Rain Alert : ఏపీ ప్రజలకు అలెర్ట్.. పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు.. హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ కేంద్రం

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 14, 2025
08:52 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి.గత కొన్ని రోజులుగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, కొన్ని ప్రాంతాల్లో మాత్రం మోస్తరు వర్షాలు నమోదవుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లోతట్టు ప్రాంతాలు నీటమునిగిపోతున్నాయి. మరోవైపు, రైతులు సాగు చేసిన పంటలు వర్షాల ధాటికి నష్టపోతున్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ ఏపీ ప్రజలకు మరో పెద్ద హెచ్చరికను జారీ చేసింది. రాబోయే మూడు రోజులు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.

వివరాలు 

నైరుతి రుతుపవనాల ఉపసంహరణకు పరిస్థితులు అనుకూలం

అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్, ఝార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఒడిశా, తెలంగాణ రాష్ట్రాల కొంతభాగాల నుంచి వచ్చే మూడురోజుల్లో నైరుతి రుతుపవనాల ఉపసంహరణకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని పేర్కొంది. అదేవిధంగా, నైరుతి బంగాళాఖాతం నుండి దక్షిణ తమిళనాడు తీరప్రాంతం మీదుగా 5.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం వ్యాపించి ఉందని వెల్లడించింది. ఈ ఆవర్తనం ఉత్తర తమిళనాడు తీరం, నైరుతి బంగాళాఖాతం, దక్షిణ తమిళనాడు తీరప్రాంతాల మీదుగా విస్తరించి ఉండటంతో, రాబోయే మూడు రోజులు ఏపీలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.

వివరాలు 

ఈ జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు

వాతావరణ శాఖ సమాచారం ప్రకారం, ఇవాళ (మంగళవారం) ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, నెల్లూరు, కర్నూలు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులు, ఈదురుగాలులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశముందని తెలిపింది. ఇక తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, అంబేద్కర్ కోనసీమ, అల్లూరి సీతారామరాజు, చిత్తూరు, అన్నమయ్య, శ్రీ సత్యసాయి, నంద్యాల, కడప, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదవుతాయని అంచనా వ్యక్తం చేసింది. వర్షాల ప్రభావం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ అధికారులు సూచించారు. వర్షం కురుస్తున్న సమయంలో అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు వెళ్లవద్దని హెచ్చరించారు.

వివరాలు 

రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు

పిడుగులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భద్రతా చర్యలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా వర్ష సమయంలో చెట్ల కింద, పెద్ద హోర్డింగ్స్ లేదా బోర్డులు ఉన్న ప్రదేశాల్లో నిలబడకూడదని ప్రజలకు సూచించారు. సోమవారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. సాయంత్రం 5 గంటల వరకు నమోదైన వర్షపాతం ప్రకారం - ఏలూరు జిల్లా లింగపాలెంలో 74.2 మిల్లీమీటర్లు, చింతలపూడిలో 68.7 మిల్లీమీటర్లు, బాపట్లలో 62.5 మిల్లీమీటర్లు, విజయనగరం జిల్లా పులిగుమ్మిలో 61 మిల్లీమీటర్లు, కృష్ణా జిల్లా ఉయ్యూరులో 60.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.