TG Weather Update: గజగజ వణుకుతున్న తెలంగాణ.. 4జిల్లాల్లో 10డిగ్రీల లోపే ఉష్ణోగ్రతలు.. మరో రెండు రోజులు ఇదే పరిస్థితి
తెలంగాణలో చలి గాలుల తీవ్రత పెరిగింది. రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల కంటే తక్కువగా నమోదయ్యాయి. ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్‌లో అత్యల్పంగా 8.3 డిగ్రీల సెల్సియస్ నమోదవగా, సంగారెడ్డి జిల్లా కోహిర్‌లో 8.8 డిగ్రీలు నమోదయ్యాయి. సంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలు కూడా 10 డిగ్రీల లోపు కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు చేశాయి. అలాగే, రంగారెడ్డి, కామారెడ్డి, వికారాబాద్, నిజామాబాద్, సిరిసిల్ల, సిద్దిపేట, నిర్మల్ జిల్లాల్లో 11 డిగ్రీల లోపే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
వాతావరణ శాఖ హెచ్చరిక
రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో 15 డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. రానున్న రెండు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత తగ్గుతాయని అంచనా వేసింది. ముఖ్యంగా ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో 10 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా, 30 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు.
వృద్ధులు జాగ్రత్తగా ఉండాలి
శీతాకాలంలో వృద్ధులు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. జలుబు, దగ్గు, ఆస్తమా వంటి సమస్యలు తీవ్రతరం అయితే ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్లు, గుండె సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చల్లటి వాతావరణం కీళ్లనొప్పులు, వైరల్ ఫ్లూలను మరింత ప్రబలించే అవకాశముంది. ఈ సమస్యలను నివారించేందుకు వేడి నీళ్లు తాగడం, వేడి బట్టలు ధరించడం వంటి జాగ్రత్తలు తీసుకోవడం అవసరం.
పిల్లల ఆరోగ్యం జాగ్రత్తలు
చలికాలంలో చిన్నారులు సీజనల్ వ్యాధుల ప్రమాదం ఎక్కువగా ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు. జలుబు, దగ్గు, జ్వరం వంటి ఇన్ఫెక్షన్లు పిల్లలపై అధిక ప్రభావం చూపే ప్రమాదం ఉంటుంది. పిల్లలు చలికి గురి కాకుండా వెచ్చటి బట్టలు ధరించాలి. చేతులకు గ్లవ్స్, కాళ్లకు సాక్స్, శరీరాన్ని చల్లటి గాలుల నుంచి రక్షించే బట్టలు ఉపయోగించాలి. ఈ జాగ్రత్తలతో చిన్నారులను చలితీవ్రత నుండి రక్షించవచ్చు.